Sun Flower Crop Loss : ఈసారైనా మంచి దిగుబడి సాధించాలని కొండంత ఆశతో పంటలు వేసిన రైతులకు మళ్లీ నిరాశే మిగిలింది. ఆరుగాలం కష్టపడి సాగు చేసిన పంటకు దిగుబడి రానివేళ.. ఆ రైతు ఆవేదనను మాటల్లో వర్ణించలేము. శ్రీ సత్యసాయి జిల్లాలో రైతులకు నాణ్యతలేని పొద్దు తిరుగుడు విత్తనాలు అంటగట్టి మోసం చేశారని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లావ్యాప్తంగా 4వేల ఎకరాల్లో పొద్దు తిరుగుడు పంటను సాగుచేసిన రైతులు ఏపుగా పెరిగిన పంటకు తాలుగింజలు రావడాన్ని చూసి కన్నీటి పర్యంతమవుతున్నారు.
రైతులు వ్యవసాయ అధికారులకు చెప్పినా పట్టించుకోకపోవటం వల్ల.. స్పందనకు వెళ్లి జిల్లా కలెక్టర్ ఎదుట మొర పెట్టుకున్నారు. కలెక్టర్ ఆదేశాలతో ముగ్గురు శాస్త్రవేత్తలు సుడిగాలి పర్యటన చేస్తూ రెండు క్షేత్రాల్లో పంటను గట్టుమీద నుంచే పరిశీలించి వెళ్లారు. వర్షాల కారణంగా పంటకు అనేత చీడలు వచ్చాయని, రైతులు వీటిని అదుపుచేసే చర్యలు తీసుకోలేదని నివేదికలో చెప్పారు. వాతావరణం కూడా అనుకూలించక తాలుగింజలు వచ్చాయని చెప్పారే తప్ప, విత్తనం గురించి ఏమాత్రం ప్రస్తావించలేదని అన్నదాతలు వాపోతున్నారు.
జిల్లావ్యాప్తంగా నాలుగు మండలాల్లో పంట నష్టపోగా, కేవలం ముదిగుబ్బ, తలుపుల మండలాల్లో రెండు క్షేత్రాలను మాత్రమే శాస్త్రవేత్తలు పరిశీలిచారు. అధికారులు కంపెనీల పక్షంగా వ్యవహరిస్తున్నారని భావించిన రైతులు, రెడ్స్ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులను ఆశ్రయించారు. నష్టపోయిన రైతుల సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లామని రెడ్స్ సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంటలు నష్టపోవటంతో.. రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు తగు చర్యలు తీసుకుని వారిని ఆదుకోవాలని కోరుతున్నారు.
ఇవీ చదవండి: