BJP leaders fire on YCP government: ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికల సమయం దగ్గరపడుతున్న కొద్దీ.. వైసీపీ ప్రభుత్వం టక్కు టమార గోకర్ణ విద్యలను ప్రదర్శిస్తోందని.. బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్, రాజసభ్య సభ్యులు జీవీఎల్ నరసింహారావు, భాను ప్రకాష్ రెడ్డిలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నెలలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార పార్టీ నాయకులు.. అర్హత లేని వారందరికీ ఓటు హక్కును పొందేలా చేసి, ఎలాగైనా ఎన్నికల్లో గెలవాలని చూస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు.
శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురానికి విచ్చేసిన బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విశాఖలో గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్‌ను ఆర్భాటంగా చేశారే గానీ విదేశీ పెట్టుబడులు రాలేదన్నారు. ఆస్థాన కంపెనీలతో ఏంవోలు చేసుకోవడం తప్ప గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్‌తో ఉపయోగం ఏమీ లేదని ఎద్దేవా చేశారు. పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార పార్టీ వైసీపీ టక్కు టమారా గోకర్ణ విద్యను ప్రదర్శిస్తోందన్నారు. అర్హత లేని వారందరినీ ఓటు హక్కుకు నమోదు చేయించి.. ఓటు హక్కును పొందేలా చేసి, ఎలాగైనా ఎన్నికల్లో గెలవాలని చూస్తోందన్నారు. సీఎం జగన్,, ఉత్తుత్తి బటన్ నొక్కినట్టుగా, ఉత్తుత్తి కార్యక్రమాలు చేయడం ప్రజలందరూ గమనిస్తున్నారని గుర్తు చేశారు.
ఉత్తరాంధ్ర పట్టభద్రులు ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు.. పీవీఎన్ మాధవ్ తరపున ప్రచారం చేయడానికి విజయనగరం విచ్చేశారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా కార్యాలయంలో నిర్వహిచిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. దేశం మొత్తం కాషాయం పరం కాబోతోందన్నారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా జరిగిన అనేక ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటిందని, ఈశాన్య రాష్ట్రాల్లో సైతం పార్టీ జెండా ఎగురవేశామన్నారు. ఇక ఏపీలో ఉత్తరాంధ్ర విషయానికొస్తే.. ఈ ప్రాంతం ఇక్కడి రాజకీయ నాయకుల దోపిడీకీ గురైందన్నారు. పుష్కలమైన వనరులు ఉన్నప్పటికీ., వెనుకబాటుకు, వలసలకు నిలయంగా మారటం ఈ ప్రాంత దురదృష్టమన్నారు. ఇప్పటికైనా ఉత్తరాంధ్ర ప్రజలు, మేధావులు, పట్టభద్రులు మేల్కొని.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్ధి పీవీఎన్ మాధవ్‌ను గెలిపించాలని పిలుపునిచ్చారు.
ఇక రాష్ట్రంలో జరుగుతున్న పెట్రోల్, డీజిల్ అక్రమ రవాణాపై కేంద్ర విజిలెన్స్ కమిషనర్‌కు లేఖ రాశానని బీజేపీ అధికార ప్రతినిధి భాను ప్రకాష్ రెడ్డి తెలిపారు. రాష్ట్ర సరిహద్దుల్లో విచ్ఛలవిడిగా పెట్రోల్, డీజిల్ అక్రమ రవాణా మాఫియా నడుస్తోందని ఆయన ఆరోపించారు. పెట్రోల్, డీజిల్ అక్రమ రవాణాపై తనిఖీలు నిర్వహించి, తగు చర్యలు తీసుకోవాలని కేంద్ర చీఫ్ విజిలెన్స్ కమిషన్‌కు లేఖ పంపానని తెలిపారు. ప్రభుత్వ అధికారులు, పెట్రోల్ పంప్ డీలర్ల సహకారంతో, బహుశా ఆయిల్ కంపెనీల అధికారులతో కుమ్మక్కై ఈ అక్రమ రవాణాను సాగిస్తున్నారని ఆరోపించారు. సామాన్యులపై భారం తగ్గించాలనే ఉద్దేశ్యంతో నరేంద్ర మోదీ ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించిందన్నారు. రాష్ట్ర జీఎస్టీని తగ్గించడం ద్వారా పెట్రోల్ ఉత్పత్తుల భారంలో కొంత భాగాన్ని పంచుకోవాలని కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలను అభ్యర్థించిందని, తద్వారా సామాన్యుల సమస్య తగ్గుతుందని ఆయన రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు.
ఇవీ చదవండి