నేతన్నలను ఆదుకునేందుకు వైకాపా ప్రభుత్వం వైఎస్సార్ నేతన్న నేస్తం అంటూ సహాయం అందిస్తోంది. ఈ పథకం ద్వారా మగ్గం ఉండి దానిపైనే ఆధారపడి బతుకుతున్న నేతన్నలకు 24వేల రూపాయలు ఆర్ధిక సాయం అందించనున్నారు. వైఎస్సార్ నేతన్న నేస్తం పథకాన్ని ఈరోజు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభించాల్సి ఉండగా.. అసెంబ్లీ సమావేశాలు వల్ల ఈ నెల 20న లాంఛనంగా ప్రారంభించనున్నారు. అదే రోజున లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా నగదు జమకానుంది. ఈ మేరకు ప్రకాశం జిల్లా వ్యాప్తంగా లబ్ధిదారుల ఎంపికపై నెల రోజులుగా అధికారులు సర్వే నిర్వహించారు. మగ్గాలను సైతం జియో ట్యాగింగ్ చేయటంతో 6.915 మందిని అర్హులుగా గ్రామ, వార్డు సచివాలయ వాలంటీర్లు ఎంపిక చేశారు.
జిల్లాలోని 56 మండలాల్లో 31 మండలాల్లో చేనేతకార్మికులుండగా.. వీరిలో 90 శాతం వరకు చీరాల నియోజకవర్గంలో ఉన్నారు. మిగిలినవారు చీమకుర్తి, వలపర్ల, గిద్దలూరు, ఈతముక్కల, కనిగిరి తదితర ప్రాంతాల్లో ఉన్నారు. గత సంవత్సరం 7,184 మంది అర్హులుండగా.. ఈ ఏడాది. 6,915 మంది లబ్దిపొందనున్నారు. 300 యూనిట్లు విద్యుత్ బిల్లు చెల్లించిన వారు, ఆదాయం పన్ను చెల్లించేవారు, వివిధ పథకాల్లో లబ్దిపొందిన వారిని ఈ ఏడాది తొలిగించామని చేనేత జౌళి సహాయ సంచాలకులు శివనారాయణ తెలిపారు.
ఇవీ చూడండి... : శనగరైతుల కష్టాలు... దిగుబడి వచ్చినా కనిపించని లాభాలు...