పంట నష్టంతో అప్పుల తీర్చలేక.. ఓ యువ రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ప్రకాశం జిల్లా పర్చూరు మండలం తన్నీరువారిపాలెం గ్రామానికి చెందిన యువరైతు ఆళ్ల సాంబశివరావు (40) తనకున్న కొద్దిపాటి పొలంతో పాటు.. ఇతర ప్రాంతాలకు వెళ్లి కౌలుకు తీసుకొని పత్తి, మిర్చి సాగు చేశాడు. ఆశించిన దిగుబడి రాక తీవ్రంగా నష్టపోయిన సాంబశివరావు అప్పుల పాలయ్యాడు. అప్పు తీసుకున్న వారికి తిరిగి చెల్లించలేక సతమతమవుతున్నాడు. గ్రామస్థులతో కలసి మూడు రోజుల క్రితం తిరుపతి వెళ్లి తిరిగి వచ్చాడు. పెదనందిపాడు మండలం అన్నవరంలో ఉన్న అత్తగారింటికి ప్రసాదం ఇచ్చి వస్తానని చెప్పి ఇంటి నుంచి వెళ్లాడు.
కానీ అప్పుల బాధతో మనస్తాపానికి గురైన సాంబశివరావు.. దారిలోనే చిలకలూరిపేట మండలం కుక్కపల్లివారిపాలెం వద్ద చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఉదయాన్నే అటుగా వెళుతున్న వారు చూసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. చిలకలూరిపేట గ్రామీణ సీఐ సుబ్బారావు ఆధ్వర్యంలో ఎస్సై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్య చేసుకున్న రైతు సాంబశివరావుకు భార్య శివ పార్వతి, కుమార్తెలు విజయలక్ష్మి (12 ), తేజస్విని( 10 )ఉన్నారు. కుటుంబానికి పెద్ద దిక్కు కోల్పోవడంతో వారంతా కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
ఇదీ చదవండీ.. HEAVY FLOOD: కాజ్వే పై వరద.. రాకపోకలకు తీవ్ర అంతరాయం