మాజీ ఎమ్మెల్యే, వైకాపా నేత ఆమంచి కృష్ణమోహన్ సోదరుడు ఆమంచి స్వాములు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పోలీసులు నిజాయితీగా నడుచుకోకపోతే చీరాలలో వ్యవస్థకు కచ్చితంగా ఇబ్బంది కలుగుతుందని హెచ్చరించారు. అలాగే కరణం బలరాం వర్గంపైనా అసభ్యకర వ్యాఖ్యలు చేశారు. ఆ సమయంలో ఆయన పక్కన ఆమంచి కృష్ణమోహన్ కూడా ఉన్నారు. జగన్ పాదయాత్ర పూర్తి చేసి మూడేళ్లయిన సందర్భంగా 'ప్రజల్లోనాడు-ప్రజల కోసం నేడు' పేరిట ప్రకాశం జిల్లా చీరాలలో శుక్రవారం ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తి, మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ పోటాపోటీగా కార్యక్రమాలు నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే అమంచి కృష్ణమోహన్ ఆధ్వర్యంలో వేటపాలెం మండలం దేశాయిపేట నుండి చీరాల వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం చీరాలలో బహిరంగ సభలో మాట్లాడిన స్వాములు... కార్యకర్తలను రెచ్చగొట్టేలా ఆవేశంతో ఊగిపోతూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
నేతలు ఆదేశాలు ఇచ్చారు కదా అని పోలీసులు నిజాయితీగా నడుచుకోకపోతే ఇక్కడ కచ్చితంగా వ్యవస్థకు ఇబ్బంది కలుగుతుంది. ఏ రోజు కూడా చీరాలలో పోలీసుల అవసరం లేకుండానే కార్యక్రమాలు నిర్వహించాం. ఇవాళ పోలీసులు వచ్చి ఏదైనా చేద్దాం అనుకుంటే అది పొరపాటున కూడా జరగదు. ప్రత్యర్థులను ఎట్టిపరిస్థితుల్లోనూ క్షమించం- ఆమంచి స్వాములు, వైకాపా నేత
ఇదీ చదవండి
సీఎం జగన్ లేఖ అంశంలో దాఖలైన పిటిషన్లపై 16న 'సుప్రీం' విచారణ