ప్రకాశం జిల్లా దొనకొండ పోలీసు స్టేషన్‌లో మార్చి నెలలో స్వప్న అనే మహిళ... తన భర్త తనను మోసం చేసి విదేశాలకు వెళ్లిపోయాడు అంటూ ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులకు దిమ్మ దిరిగే విషయాలు తెలిశాయి. ఆమె చేసిన నేరాలు ఒక్కొక్కటిగా వెలుగుచూశాయి. నిందితురాలిని పోలీసులు అరెస్టు చేశారు.
జిల్లాలోని దొనకొండ మండలం వీరేపల్లి గ్రామానికి చెందిన రామాంజనేయులుతో స్వప్న అనే యువతికి కొంతకాలం క్రితం వివాహం జరిగింది. అయితే వివాహం అనంతరం తనను మోసం చేసి... రామాంజనేయులు డెన్మార్క్‌లో ఉంటున్నాడని స్వప్న దొనకొండ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు... రామాంజనేయులు తండ్రిని అదుపులోకి తీసుకొని విచారించగా.. స్వప్న గురించి ఆసక్తికర విషయాలు వారి దృష్టికి వచ్చాయి. అనంతరం వారు స్వప్న గురించి వాకబు చేశారు. ఆమె గతంలోనే తన మేనమామతో పాటు.. తిరుపతికి చెందిన మరో వ్యక్తిని వివాహం చేసుకొని మోసం చేసినట్లు గుర్తించారు. దొనకొండ పోలీసులు ఆమె గురించి లోతుగా దర్యాప్తు చేయగా... అనేకచోట్ల పలు మోసాలకు పాల్పడినట్లు తేలింది. శనివారం స్వప్నను అరెస్టు చేసి న్యాయమూర్తి ముందు హాజరుపరచగా 15రోజులు రిమాండు విధించినట్లు పోలీసులు తెలిపారు.
ఐపీఎస్ అధికారినంటూ...
తిరుపతికి చెందిన యువతి పతంగి స్వప్న.... అలియాస్ పతంగి హరిణి, అలియాస్ నందమూరారి స్వప్న ఇలా పేర్లు మార్చి ముచ్చటగా మూడు పెళ్లిళ్లు చేసుకుంది. మ్యాట్రిమోని వెబ్సైట్లలో తాను ఐపీఎస్ అధికారిగా బయోడేటా ఇచ్చి ఆర్థికంగా ఉన్నవారిని నమ్మించి బుట్టలో పడేస్తుంది. పెళ్లి చేసుకుని కొంత కాలం కాపురం చేసిన తర్వాత వేరుగా ఉంటానని సెటిల్‌మెంట్ చేసుకుంటుంది.
గత ఏడాది డిసెంబరులో ప్రకాశం జిల్లా దొనకొండ మండలం వీరేపల్లి గ్రామానికి చెందిన రామాంజనేయులును పెళ్లి చేసుకుంది. మూడు నెలలపాటు వారు హైదరాబాద్‌లో కాపురం పెట్టారు. డెన్మార్క్‌లో ఉద్యోగం చేసే రామాంజనేయులు... స్వప్నను అక్కడకు తీసుకెళ్లేందుకు ప్రయత్నించాడు. అయితే ఆమె అక్కడకు వెళ్లేందుకు నిరాకరించింది. రామాంజనేయులు ఒక్కడే డెన్మార్క్ వెళ్లాడు. కానీ స్వప్న వ్యవహార శైలిపై అనుమానం వచ్చి... ఆమె వివరాలు రాబట్టాడు. తన కంటే ముందు మరో ఇద్దరిని ఆమె వివాహం చేసుకున్నట్టు తెలుసుకున్నాడు. రెండో భర్తపై తిరుపతి మహిళా పోలీస్ స్టేషన్‌లో స్వప్న కేసు కూడా పెట్టినట్టు తెలుసుకున్నాడు. అంతే కాదు తిరుపతికి చెందిన ఓ మహిళకు ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి ఆమె వద్ద నుంచి 6 లక్షల రూపాయలు వసూలు చేసిందని... ఈ వ్యవహారంపై తిరుపతి సీసీఎస్ పోలీస్ స్టేషన్‌లో స్వప్నపై కేసు కూడా నమోదైందని తెలుసుకున్నాడు. అనంతరం స్వప్నను నిలదీశాడు. పెళ్లి చేసుకున్నావు కాబట్టి 30 లక్షల రూపాయలు ఇచ్చి సెటిల్‌మెంట్ చేసుకోవాలని స్వప్న డిమాండ్ చేసింది. అతను ఆమె బెదిరింపులకు లొంగకపోవటంతో అతనిపై దొనకొండ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.
మరోవైపు స్వప్న వ్యవహారంపై రామాంజనేయులు కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల విచారణలో స్వప్న అసలు రంగు బయటపడింది. రెండు కేసులను పరిగణలోకి తీసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఫణిభూషణ్ తెలిపారు.