సహజీవనం చేస్తున్న వ్యక్తే మహిళను హత్య చేసి మృతదేహాన్ని గదిలో పెట్టి ఆపై ఇంటికి తాళం వేసి రాష్ట్రం విడిచి పరారయ్యాడు. ఈ ఘటన బల్లికురవ మండలం చెన్నుపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఒడిశా రాష్ట్రానికి చెందిన ఓ వ్యక్తి, మరో మహిళ మూడు నెలలుగా చెన్నుపల్లి గ్రామంలో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని సహ జీవనం చేస్తున్నారు.
ఆ వ్యక్తి కొండాయపాలెం ఈర్లకొండ వద్దనున్న ఓ క్వారీలో పనులకు వెళ్తూ జీవనం సాగిస్తున్నాడు. నాలుగు రోజులుగా పనులకు వెళ్లడం లేదు. దీంతో అతనితో పని చేసే ఓ వ్యక్తి చెన్నుపల్లిలోని గది వద్దకు వచ్చి సోమవారం పరిశీలించగా తాళం వేసి కనిపించింది. దుస్తులు తీసుకుని స్వగ్రామానికి వెళ్లాడేమోననే అనుమానంతో ఇంటి తాళాలు పగుల కొట్టి లోపలికి వెళ్లాడు. రక్తపు మడుగులో పురుగులు పట్టి ఉన్న స్థితిలో ఓ మహిళ మృతదేహం అతనికి కనిపించింది. వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. సంఘటనా స్థలాన్ని దర్శి డీఎస్పీ ప్రకాశ్‌రావు, అద్దంకి సీఐ ఆంజనేయరెడ్డి, ఎస్సై శివనాంచారయ్య పరిశీలించారు.
చుట్టుపక్కల వారిని విచారించారు. రాత్రి సమయంలో మరో వ్యక్తి ఇంటికి వస్తున్నట్టు తెలుసుకుని అతని ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు. మృతురాలు పొదిలి ప్రాంతానికి చెందిన మహిళగా భావిస్తున్నారు. సంఘటనపై కేసు నమోదు చేయడంతో పాటు ఒడిశాకు పారిపోయిన వ్యక్తిని మేస్త్రి సహాయంతో అదుపులోకి తీసుకుని బల్లికురవకు తరలించనున్నట్టు పోలీసులు తెలిపారు.
ఇదీ చదవండి: