Three Dead in Road Accident at Tarlupadu : ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు యువకులు మృతి చెందారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. ముగ్గురు జిల్లాలోని యర్రగొండపాలెంలో ఓ నిశ్చితార్థానికి వెళ్లి తిరిగి స్వగ్రామానికి వస్తున్న సమయంలో తర్లుపాడు మండలం కలుజువ్వలపాడు వద్ద లారీ, ద్వి చక్రవాహనం ఢీకొన్నాయి. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు అంభాపురానికి చెందిన వినోద్, నాని, వీరేంద్రగా గుర్తించారు. వీరందరికి 20 సంవత్సారాలలోపు వయస్సు ఉంటుందని తెలుస్తోంది. ఘటనా స్థలాన్ని పోలీసులు పరిశీలించారు.
రోడ్డు ప్రమాదంలో తండ్రి కూతురు మృతి : పల్నాడు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తండ్రి కూతురు మృతి చెందారు. వివరాల్లోకి వెళితే.. పిడుగురాళ్ల మండలంలోని శ్రీనివాస నగర్ వద్ద అయ్యప్ప నగర్‌కు చెందిన యనమల నరసింహారావు (40), ఆయన కూతురు శ్రీనిధి (15)కి పుస్తకాల కోసం బ్రాహ్మణపల్లి వెళ్లారు. తిరుగు ప్రయాణంలో లారీ ఢీకొనగా తండ్రి కూతురూ ఇద్దరు దుర్మరణం పాలయ్యారు. మృతదేహాలను గురజాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకోని దర్యాప్తు చేస్తున్నారు.
ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టిన లారీ..యువకుడు మృతి : గుంటూరు జిల్లా రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో యువకుడు మృతి చెందాడు. వివరాల్లోకి వెళితే.. మేడి కొండూరు పోలీస్ స్టేషన్ వద్ద పల్నాడు జిల్లా దాచేపల్లి నుంచి లారీ గుంటూరు వస్తున్న లారీ ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో మేడి కొండూరు గ్రామానికి చెందిన గుండాల సామి ఏలు(24) అక్కడికక్కడే మృతి చెందారు. మృతుడి కుటుంబీకులు, బంధువులు కన్నీరు మున్నీరుగా విలపించారు. శవ పంచనామా నిమిత్తం మృతదేహాన్ని గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన లారీని పోలీసులు స్టేషన్‌కు తరలించారు.
ఆర్టీసీ బస్సు ఢీకొని.. రైతు మృతి : పల్నాడు జిల్లాలో ఆర్టీసీ బస్సు ఢీకొన్న ప్రమాదంలో రైతు మృతి చెందారు. వినుకొండ పట్టణ సీఐ సాంబశివరావు తెలిపిన వివరాల మేరకు నూజెండ్ల మండలం పాత నాగిరెడ్డి పల్లి గ్రామానికి చెందిన గోగ నాగేశ్వరరావు (46), అదే గ్రామానికి చెందిన నాదెండ్ల మోహన్ రావు తో కలిసి ద్విచక్ర వాహనంపై వ్యవసాయ మోటారు మరమ్మత్తులు నిమిత్తం వినుకొండకు వస్తున్నారు. అదే సమయంలో ఎర్రగొండపాలెం వైపు వెళ్తున్న వినుకొండ ఆర్టీసీ ఢీకొట్టడంతో నాగేశ్వరరావు అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన నాదెండ్ల మోహన్రావును 108 సహాయంతో వినుకొండ ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా, పరిస్థితి విషమంగా ఉండటంతో ప్రాథమిక చికిత్స అనంతరం నరసరావుపేటకు తరలించారు. రైతు నాగేశ్వరరావు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం వినుకొండ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఈ మేరకు పట్టణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.
అప్పుల బాధతో వృద్ధ దంపతులు ఆత్మహత్య : పశ్చిమగోదావరి జిల్లా అత్తిలిలో వృద్ధ దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. వ్యవసాయం కలిసిరాక, అప్పుల భారం పెరిగి.. ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక గంగుమళ్ల నరసయ్య(72), భార్య భూలక్ష్మి (62) పురుగుల మందు తాగి బలవన్మరణం చేసుకున్నారు. అత్తిలి గ్రామానికి చెందిన గంగుమళ్ల నరసయ్య కౌలు వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. కుమారుడు కుమార్తెలకు వివాహం చేయటంతో ఎవరి కుటుంబాలు వారు విడిగా జీవనం సాగిస్తున్నారు. నరసయ్య కు వ్యవసాయంలో కలిసి రాకపోవడంతో అప్పుల భారం పెరిగిపోయింది. ఆర్థిక సమస్యలతో ఇబ్బందులు పడుతున్న నరసయ్య తన భార్య భూలక్ష్మితో కలిసి వ్యవసాయంలో కలుపు నివారణకు వాడే మందును తాగారు. విషమ పరిస్థితుల్లో ఉన్న వీరిని చికిత్స నిమిత్తం తణుకు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందారు. అత్తిలి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
నవవధువు మృతి : ఎన్టీఆర్ జిల్లా విజయవాడ వాంబే కాలనీ డి బ్లాక్ లో నవవధువు అనుమానాస్పద మృతి చెందారు. మృతురాలు ఆలమూరు హేమ తేజ(20)గా గుర్తించారు. భర్త నరేష్ ఓ ప్రవేట్ ఫైనాన్స్ కంపేనీలో ఉద్యోగి.., మూడు నెలల క్రితం వివాహాం అవ్వగా రెండు రోజుల క్రితం ఆషాడమాసం పూర్తి చేసుకొని మృతురాలు అత్తగారి ఇంటికి వచ్చింది. మధ్యాహ్నం భోజనం తరువాత పడక గదిలో తలుపు వేసుకొని ఉరివేసుకున్న యువతి.. అనుమానాస్పద స్ధితిలో మృతి చెందారు. సంఘటన స్ధలానికి చేరుకున్న నున్న గ్రామీణ పోలీసులు విచారణ చేపట్టారు.
ఉపాధ్యాయుడి మందలింపు.. విద్యార్థి ఆత్మహత్య : ఉపాధ్యాయుడు మందలించాడని పదో తరగతి విద్యార్థి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఏలూరు జిల్లా పెదవేగి మండలం కొప్పాక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్న పామర్తి ప్రదీప్.. పోలవరం కుడి కాలువలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. పాఠశాలలో హిందీ ఉపాధ్యాయుడి వేధింపుల వల్లే ప్రదీప్ ఆత్మహత్య చేసుకున్నాడని మృతుడి బంధువులు ఆరోపిస్తున్నారు. ఉపాధ్యాయుడిపై చర్యలు తీసుకోవాలంటూ విద్యార్థి మృతదేహంతో పాఠశాల ఎదుట ఆందోళన చేపట్టారు. విద్యార్థి కుటుంబ సభ్యులను మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పరామర్శించారు.