పేదలకు ఉగాది నాటికి ఇళ్ల పట్టాలను పంపిణీ చేసేందుకు జిల్లాలో అన్ని చర్యలు చేపట్టామని ప్రకాశం జిల్లా కలెక్టర్ పోల భాస్కర్ అన్నారు. అందులో భాగంగా భూసేకరణ సమయంలో క్షేత్ర స్థాయి సమస్యలను పరిగణలోకి తీసుకొని అడుగు ముందుకేస్తున్నామని చెప్పారు. ఇళ్ల పట్టాల కోసం భూసేకరణ విషయంలో వస్తోన్న వివాదాలపై సంయుక్త కలెక్టర్ షన్మోహన్‌తో కలిసి ఆయన వివరణ ఇచ్చారు. ప్రభుత్వ భూములు అక్రమణలో ఉంటే ఆక్రమణదారులకు నచ్చజెప్పి సానుకూల వాతావరణంలో వాటిని స్వాధీనం చేసుకుంటున్నామని తెలిపారు. బలవంతంగా భూసేకరణ చేయటం లేదని... అదే విధంగా ఎస్సైన్డ్ భూములు ఒక్క ఎకరా కూడా తీసుకోవడం లేదని వెల్లడించారు.
పొదిలి మండలంలో ఇళ్ల పట్టాలు ఇచ్చిన వారి దగ్గర నుంచి భూములను తిరిగి స్వాధీన పరుచుకున్నామనే ప్రచారం వాస్తవం కాదని కలెక్టర్ అన్నారు. 'అక్కడ దాదాపు 20 ఏళ్ల క్రితం 1700 ఇళ్ల పట్టాలు ఇస్తే, అందులో 320 మంది మాత్రమే పొజిషన్‌లో ఉన్నారు. పైగా అప్పటి అవసరాలకు మించి ఎక్కువుగా స్థల సేకరణ చేశారు. ఆ స్థలమంతా తుప్పలతో నిండిపోయింది. పొజిషన్‌లో లేని ఖాళీ స్థలాలు, మిగిలిన స్థలాన్ని మాత్రమే తీసుకొని ఇళ్ల పట్టాలకు సిద్ధం చేస్తున్నాం. మరికొన్ని చోట్ల ప్రభుత్వ స్థలాలను ఆక్రమించుకొని ఇళ్లు నిర్మించుకున్న వారు ఉన్నారు. అలాంటి వారిని కూడా గుర్తించి పట్టాలిస్తాం. అంతే తప్ప ఎవరి వద్ద బలవంతపు సేకరణ చేయడం లేదు. జిల్లావ్యాప్తంగా 1.06 లక్షల మంది ఇళ్ల పట్టాల కోసం దరఖాస్తు చేసుకున్నారు. వారికి సుమారు 2,400 ఎకరాలు భూమి అవసరం. ప్రస్తుతం ప్రభుత్వ భూమి 1860 ఎకరాలు అందుబాటులో ఉంది. మిగిలిన భూమిని కొనుగోలు చేసి పట్టాలు పంపిణీకి కృషి చేస్తాం' అని కలెక్టర్ భాస్కర్, జాయింట్ కలెక్టర్ షన్మోహన్ తెలిపారు.
ఇదీ చదవండి: