ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో అన్ని సౌకర్యాలతో మినీ స్టేడియం నిర్మిస్తున్నారట.. ఇకపై దూర ప్రాంతాలకు వెళ్లి సాధన చేయాల్సిన శ్రమ తప్పింది. ఇలా ఎంతోమంది క్రీడాకారుల ఆశలు అడియాశలుగా మారాయి. రూ.కోట్లు ఖర్చు చేసి నిర్మించిన మినీ స్టేడియం, అంబేడ్కర్, జగ్జీవన్‌రామ్ ఆడిటోరియం భవనాలు నిరుపయోగంగా దర్శనమిస్తున్నాయి. నాటి తెదేపా ప్రభుత్వ హయాంలో భవనాలు మంజూరయ్యాయి. నిర్మాణాలు సైతం పూర్తి చేశారు. పాలకులు, అధికారుల నిర్లక్ష్యమో తెలియదుకానీ ఏడాది గడుస్తున్నా నేటికీ ప్రారంభానికి నోచుకోలేదు.
యువత ఎదురుచూపులు..
2019లో పట్టణంలోని ప్రభుత్వ పాఠశాలలో రూ.2కోట్లతో మినీ స్టేడియం నిర్మాణానికి నాటి ఎమ్మెల్యే పాలపర్తి డేవిడ్‌రాజు శంకుస్థాపన చేశారు. అనేక ఒడిదుడుకుల మధ్య స్టేడియాన్ని పూర్తి చేశారు. ఈ క్రీడా మైదానంలో షటిల్ సాధనకు ఉపయోగకరంగా ఉంటుంది. అంతేకాకుండా క్రీడాకారులు, యువత మానసిక ఆరోగ్య ఉల్లాసానికి వ్యాయామం చేసుకునేందుకు ఎంతో తోడ్పాటునిస్తుంది. దీన్ని ప్రారంభిస్తే ఆటలు ఆడేందుకు వారంతా ఉవ్విళ్లూరుతున్నారు.
ఆడిటోరియం పరిస్థితీ అంతే...
ఎస్సీలలోని అన్ని వర్గాల సంక్షేమం కోసం అప్పటి ఎమ్మెల్యే డేవిడ్‌రాజు ఆధ్వర్యంలో రూ.కోటితో అంబేడ్కర్ బాబూజగ్జీవన్‌రామ్ ఆడిటోరియం భవనానికి శ్రీకారం చుట్టారు. ఏడు నెలల క్రితమే నిర్మాణం పూర్తి చేసుకొంది. అయితే ఇప్పటి వరకు ప్రారంభం కాకపోవడంతో సమావేశాలు, శుభకార్యాలు జరుపుకొనేందుకు ఇబ్బందులకు గురవుతున్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు వీటిపై ప్రత్యేక దృష్టి సారించి వినియోగంలోకి తీసుకురావాలని కోరుతున్నారు.
నాలాంటి వారికి ఉపయుక్తం
మినీ స్టేడియం వినియోగంలోకి వస్తే నాలాంటి యువతకు ఎంతగానో ఉపయోగపడుతుంది. చాలామందికి షటిల్ ఆటపై మక్కువ. ఇక్కడ సాధన చేయడానికి అన్ని వసతులు ఉన్నాయని చెబుతున్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి స్టేడియం ప్రారంభానికి చర్యలు తీసుకోవాలి. అలాగే అంబేడ్కర్, జగ్జీవన్ భవనాన్ని సైతం అందుబాటులోకి తేవాలి.
- డేగల అన్వేష్, స్థానికుడు
అనుమతులు రాలేదు
వై.పాలెం మినీ స్టేడియాన్ని అన్ని సౌకర్యాలతో పూర్తి చేశాం. ఆ నివేదికలను జిల్లా స్పోర్ట్స్ అథారిటీకి పంపాం. అయితే వారి నుంచి మాకు ఎలాంటి అనుమతులు రాలేదు. ఆ తర్వాత విజయవాడలోని క్రీడలకు సంబంధించిన ఉన్నతాధికారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. అక్కడి నుంచి ఎలాంటి సమాచారం అందలేదు.
- రమణయ్య, ఆర్‌అండ్‌బీ డీఈ, వై.పాలెం
ఇదీ చూడండి.