ప్రభుత్వ పాఠశాలల దుస్థితి అధ్వానంగా తయారైంది. ఆ పాఠశాలలను పట్టించుకొనే అధికారులు కరవయ్యారు. ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలంలోని కడియాల యానాదయ్య ప్రభుత్వ పాఠశాల చాలా పురాతనమైనది. ప్రస్తుతం పాఠశాలలోకి వ్యర్థాల నీరు చేరింది. ఆ పాఠశాల పరిసర ప్రాంతాలు నీటితో జలమయమై మురుగు ఏర్పడి దుర్వాసన వెదజల్లుతోంది. ఇదే ప్రాంతంలో పాఠశాలతోపాటు కళాశాల కూడా ఉంది. ఈ పాఠశాలకు విద్యార్థులు పలు ప్రాంతాల నుంచి వస్తుంటారు. ఈ ప్రాంతంలో ప్రధాన రహదారితో పాటు క్రీడా ప్రాంగణమంతా జలమయమై ఇబ్బందిగా మారింది. ఇదే సమస్య గత రెండేళ్లుగా పునరావృతం అవుతున్నా... అధికారులు పట్టించుకోవటం లేదు.
అధ్యాపకులు సంబంధిత అధికారులకు తెలియజేస్తున్నా... పట్టించుకునే నాథుడే కరవయ్యాడు. నాయకులు వచ్చినప్పుడు దీని గురించి తెలిపిన సమస్య తీరినట్టే మాట్లాడి వెళ్లిపోతున్నారు. పాఠశాలలోకి వచ్చే విద్యార్థులు బురదలో నడుచుకుంటూ రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికైనా అధికారులు స్పందించి పరిసరాలను పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని విద్యార్థులు, ఉపాధ్యాయులు కోరుతున్నారు.
ఇదీ చదవండి: