ప్రకాశం జిల్లా మొగిలిచర్లకు చెందిన పార్టీ కార్యకర్తలను వేధిస్తున్నారంటూ తెలుగుదేశం అధినేత చంద్రబాబు (Chandra babu) డీజీపీ గౌతమ్ సవాంగ్‌కు (DGP Sawang) లేఖ రాయటంపై జిల్లా ఎస్పీ మలికా గార్గ్ (SP Malika Garg) స్పందించారు. ఈ మేరకు చంద్రబాబుకు లేఖ (Letter) రాసిన ఎస్పీ... డీజీపీకి రాసిన లేఖలోని విషయాలు తనను దిగ్బ్రాంతికి గురి చేశాయన్నారు. అధికార పార్టీకి అనుకూలంగా పోలీసులు పని చేస్తున్నారని పేర్కొనటం తమను నిరాశను గురి చేసిందన్నారు. రెండు వర్గాలు ఘర్షణ పడితే..ఇరువురిపై కేసులు పెట్టామని లేఖలో వెల్లడించారు. పోలీసులు బెదిరింపుల వల్ల ఇద్దరు వ్యక్తులు ఆత్మహత్యాయత్నం చేశారన్న విషయంపై కూడా విచారణ చేస్తున్నామన్నారు. ఈ కేసులో ఇద్దరు మైనర్ బాలురను పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చామన్నది అవాస్తవమని పేర్కొన్నారు.
తాము ఎవరి పక్షాన నిలబడలేదని..అధికార పక్షానికి కాపు కాస్తున్నామనటం పోలీసుల మనోస్థైర్యాన్ని దెబ్బతీస్తుందని ఎస్పీ తన లేఖలో పేర్కొన్నారు. పోలీసు పట్ల ప్రజల్లో చులకన భావం ఏర్పడుతుందని, వాస్తవాలపై సరైన సమాచారం లేక ఆరోపణలు చేయటం సమంజసం కాదన్నారు.
ఏం జరిగిందంటే...
ప్రకాశం జిల్లా మొగిలిచర్లకు చెందిన పార్టీ కార్యకర్తలను వేధిస్తున్నారంటూ తెలుగుదేశం అధినేత చంద్రబాబు...డీజీపీ గౌతమ్ సవాంగ్‌కు లేఖ రాశారు. వైకాపా నేతల ఆదేశాలతో ప్రకాశం జిల్లా లింగసముద్రం పోలీసులు వారిని వేధిస్తున్నారని ఆరోపించారు. ఆరుగురు కార్యకర్తలను స్టేషన్‌కు పిలిపించారని...ఆరు, పదేళ్ల చిన్నారులనూ పోలీసులు అదుపులోకి తీసుకున్నారని లేఖలో పేర్కొన్నారు. కార్యకర్తలు రత్తయ్య, శ్రీకాంత్‌ను పోలీసులు చిత్రహింసలకు గురిచేశారన్న చంద్రబాబు...వేధింపులు తట్టుకోలేక వారు ఆత్మహత్యకు యత్నించారని అన్నారు.
ఆత్మహత్యకు యత్నించిన తర్వాత మిగిలిన వారిని స్టేషన్ నుంచి పంపారని వైకాపా నేతల రాజకీయ ప్రయోజనాల కోసం పోలీసులు పనిచేస్తున్నారని లేఖలో విమర్శించారు. రెండేళ్లలో పోలీసుల బెదిరింపులు తారాస్థాయికి చేరుకున్నాయన్న చంద్రబాబు..లింగసముద్రం ఘటనపై తక్షణమే విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని లేఖలో డీజీపీని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి