ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం దంతెరపల్లి గ్రామంలో దారుణం చోటు చేసుకుంది.. కన్నతండ్రిని కొడుకు హత్య చేసిన ఘటన కలకలం రేపింది. దంతెరపల్లి గ్రామానికి చెందిన మోడీ భాస్కర్.. మద్యానికి బానిసై తరుచూ కుటుంబ సభ్యులను వేధిస్తూ ఉండేవాడు. శుక్రవారం అర్ధరాత్రి సమయంలో భార్య కుమారిని దుర్భాషలాడుతూ ఆమెపై చేయి చేసుకున్నాడు. ఆగ్రహం చెందిన పెద్ద కుమారుడు మోడీ రంగప్రసాద్.. తండ్రిపై చేయి చేసుకున్నాడు. ఇంటి నుంచి బయటకు గెంటివేశాడు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు కిందపడిన భాస్కర్.. తలకు బలమైన గాయం కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు.
గోప్యంగా ఉంచిన రంగప్రసాద్..
అయితే తండ్రి మృతి చెందిన విషయాన్ని గోప్యంగా ఉంచి రంగప్రసాద్ ఉదయాన్నే దహనసంస్కారాల ఏర్పాటు చేశాడు. ఈ విషయాన్ని స్థానిక విఆర్వో పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. దహన సంస్కారాల ప్రాంతానికి వెళ్లిన పోలీసులు భాస్కర్ మృతదేహాన్ని వెలికి తీశారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని నిందితులు ఎవరైనా సరే కఠినంగా శిక్షిస్తామని సీఐ ఫిరోజ్ తెలిపారు.
ఇదీ చదవండి: