ఎన్నికల తనిఖీల్లో భాగంగా నాటుసారా తయారీ కేంద్రాలపై ఎస్ఈబీ అధికారులు దృష్టి సారించారు. నాటుసారా తయారు చేసే వేల లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేశారు. ప్రకాశం జిల్లా ఎస్పీ సిద్ధార్ధ కౌశల్ ఆదేశాల మేరకు మార్కాపురం ఎస్ఈబీ పరిధిలోని నాటుసారా స్థావరాలపై విస్తృతంగా దాడులు నిర్వహించారు. బెస్తవారిపేట మండలం శింగరపల్లి గ్రామ అటవీ ప్రాంతంలో నాటుసారా తయారీకి సిద్ధంగా ఉన్న 800 లీటర్ల బెల్లం ఊట, ఎర్రగొండపాలెం పరిధిలోని పుల్లలచెరువు మండలం అక్కపాలెం గ్రామ అటవీ ప్రాంతంలో 3000 లీటర్లు, కంభం ఎస్ఈబీ స్టేషన్ పరిధిలో అర్ధవీడు మండలం అర్ధవీడు చెంచు కాలనీ సమీప అటవీ ప్రాతంలో 800 లీటర్లు, దర్శి పరిధిలో ముండ్లమూరు మండలం పలుకురాళ్ల తాండ అటవీ ప్రాంతంలో 900 లీటర్లు మొత్తం కలిపి 5,900 లీటర్లు బెల్లం ఊటను ఎస్ఈబీ సిబ్బంది ధ్వంసం చేశారు.
ఎవరైనా నాటు సారా తయారు చేయడం గానీ.. తయారీదారులకు సహకరించినా.. విక్రయించినా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని మార్కాపురం ఎన్ఫోర్స్మెంట్ సూపరింటెండెంట్ ఆవులయ్య తెలిపారు.
విశాఖ జిల్లాలో..
పంచాయతీ ఎన్నికల వేళ పటిష్టంగా కొనసాగిస్తున్న ఎన్నికల నియమావళిని అనుసరిస్తూ.. వాహనాలపై దృష్టి సారించారు. విశాఖ జిల్లా నర్సీపట్నం మండలం వేములపూడి వద్ద కారులో అక్రమంగా తరలిస్తున్న మద్యం సీసాలను చెక్పోస్ట్ వద్ద పోలీసులు వాహన తనిఖీలు చేసి పట్టుకున్నారు. తూర్పుగోదావరి జిల్లా వైపు ప్రయాణం చేస్తున్న కారులో మద్యం సీసాలు పట్టుబడ్డాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.