MLA Sudhakarbabu to hyderabad: ప్రకాశం జిల్లా సంతనూతలపాడు ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్‌బాబు సొంత పార్టీ నేతల వైఖరి పైనే అలిగారు. తన వ్యక్తిగత పనుల నిమిత్తం హైదరాబాద్ వెళ్తున్నందున అవసరం లేదంటూ వ్యక్తిగత భద్రతా సిబ్బందిని వెనక్కి పంపారు. ఈ వ్యవహారం ఇప్పుడు జిల్లా రాజకీయ, పోలీసు వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
ఫిర్యాదుల పరంపరతోనేనా..
నాగులుప్పలపాడు మండలంలో ఇటీవల చోటు చేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలో ఆయన ఆకస్మికంగా పార్టీ కేడర్‌కు అందుబాటులో లేకుండా వెళ్లినట్టు విస్తృతంగా ప్రచారం సాగుతోంది. ఆ మండలంలో కీలకపాత్ర పోషిస్తున్న ఓ నాయకుడికీ, ఎమ్మెల్యేకి మధ్య కొన్నాళ్లుగా మనస్పర్థలు తలెత్తాయి. ఈ క్రమంలో అక్కడ ఎంపీడీవో నియామకంపై కూడా సందిగ్దం నెలకొంది. ఈ విషయంలో ఎమ్మెల్యే వైఖరిపై అక్కడి నాయకులు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డికి ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. అదే సమయంలో ఆ నాయకుడి వ్యతిరేక వర్గం ఎమ్మెల్యేకు మద్దతుగా నిలిచింది. ఇదిలా సాగుతుండగానే చీమకుర్తి నుంచి మరో కీలకవర్గం కూడా ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా అధిష్టానాన్ని కలిసి ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదుల పరంపరపై ఆయన అలక వహించినట్టు సమాచారం. ఈ క్రమంలోనే తనకు కేటాయించిన భద్రతా సిబ్బందిని సరెండర్ చేసినట్టు తెలిసింది. ఈ విషయమై ఎమ్మెల్యే సుధాకర్‌బాబు మాట్లాడుతూ.. వ్యక్తిగత పనుల నిమిత్తం హైదరాబాద్ వచ్చానని.. భద్రతా సిబ్బంది అవసరం లేనందున వారిని సెలవుపై వెళ్లాలని సూచించినట్టు చెప్పారు.
ఇదీ చదవండి: