Rains: ప్రకాశం జిల్లా కనిగిరి పట్టణంలో భారీ ఈదురు గాలులతో కూడిన ఓ మోస్తారు వర్షం కురిసింది. భారీ ఈదురుగాలుల దాటికి పట్టణంలోని నీలకంఠం వారి వీధిలో విద్యుత్ స్తంభం నేలకొరగగా పట్టణంలోని గార్లపేట బస్టాండ్ కూడలిలో, వృద్ధుల ఆశ్రమం వద్ద పలు స్తంభాలు నేలవాలాయి. ఫలితంగా పట్టణంలో కొంత సమయం వరకు విద్యుత్ అంతరాయం ఏర్పడింది. అంతేకాక వైసీపీ శ్రేణులు బీఎస్ఎన్ఎల్ కార్యాలయం ఎదురుగా ఏర్పాటు చేసిన భారీ కటౌట్ గాలులు ధాటికి ఒక్కసారిగా నేలకూలింది. అదే సమయంలో అటుగా వెళుతున్న ఆటోలపై పడగా ఆటోలు స్వల్పంగా దెబ్బతిన్నాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు భానుడి ప్రతాపం తీవ్ర రూపం దాల్చగా ఒక్కసారిగా ఆకాశం మేఘామృతమై ఓ మోస్తరు వర్షం కురవడంతో కొంతమేర పట్టణ ప్రజలకు ఉపశమనం కలిగింది.
కడప జిల్లా వాసులకు కాస్త ఊరట: తీవ్రమైన ఎండలతో అల్లాడుతున్న కడప జిల్లా వాసులకు కాస్త ఊరట లభించింది. ఇవాళ సాయంత్రం జిల్లా వ్యాప్తంగా ఓ మోస్తారు నుంచి భారీ వర్షం కురిసింది. కమలాపురంలో కురిసిన భారీ వర్షానికి వృక్షాలు విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. కమలాపురంలో వడగండ్ల వాన కురిసింది. ఎండలతో అల్లాడుతున్న ప్రజలకు వర్షం కురవడంతో ఊపిరి పీల్చు కున్నారు. విద్యుత్ స్తంభాలు పడిపోవడంతో విద్యుత్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వృక్షాలు నేలకొరగడంతో ట్రాఫిక్ స్తంభించిపోయింది. కాకపోతే ఎవరికి ఎలాంటి ప్రమాదం సంభవించలేదు. ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు కురవడంతో పలుచోట్ల ఇంటి పైకప్పులు గాలికి లేచిపోయాయి. వెంటనే సంబంధిత అధికారులు విద్యుత్తు పునరుద్ధరణకు చర్యలు చేపట్టారు దెబ్బతిన్న విద్యుత్ స్తంభాలను తొలగించారు.
ముందుగానే చెప్పిన వాతావరణ శాఖ: నైరుతీ రుతుపవనాల ప్రభావంతో ఈసారి సాధారణ వర్షపాతాలు నమోదు అవుతాయని భారత వాతావరణ విభాగం అంచనా వేసింది. ఎల్ నినో ప్రభావంతో దేశమంతటా 96 శాతం మేర వర్షపాతం నమోదవుతుందని వాతావరణ శాఖ తెలిపింది. ప్రస్తుతం దక్షిణ బంగాళాఖాతం, అండమాన్ తీరంపై అవరించిన నైరుతీ రుతుపవనాలు... రాగల రెండు రోజుల్లో మరిన్ని ప్రాంతాలకు విస్తరిస్తాయని వాతావరణ విభాగం తెలియచేసింది. దీని ప్రభావంతో జూన్, జులై, ఆగస్టు, సెప్టెంబరు నెలల్లో రాష్ట్రంలో సాధారణ వర్షపాతం నమోదు అవుతుందని వెల్లడించింది. ఐతే జూన్‌లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు అయ్యే అవకాశం ఉందని ఐఎండీ సూచించింది. కోస్తాంధ్ర రాయలసీమ జిల్లాల్లో పలుచోట్ల ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉన్నట్టు అమరావతి వాతావరణ విభాగం స్పష్టం చేసింది.