ప్రకాశం జిల్లా తాళ్లూరు మండలం రామభద్రాపురానికి చెందిన కొందరు రైతులు గుమ్మడి సాగు చేశారు. పంట చేతికొచ్చి అమ్మకానికి సన్నద్ధమవుతున్న సమయానికి మహమ్మారి కరోనా దాపురించింది. రైతులు గుమ్మడికాయలను ఎగుమతి చేయలేక కోళ్ల ఫారాలను అద్దెకు తీసుకుని భద్రపరిచారు. కొంతమంది ఇళ్లలో రాసులుగా పోశారు. రైతులు ప్రధాన మార్కెట్లు.. మార్టూరు, గుంటూరు, విజయవాడ, తిరుపతి, బెంగళూరు తదితర ప్రాంతాలకు చారవాణులతో సంప్రదించినా.. ఫలితం దక్కలేదు. చేసేదిలేక గుమ్మడి కాయలను ఎవరికి వారు అనుకూలమైన చోట వారు భద్రపరిచారు.
ఇంతలో విపరైతమైన ఎండలు ముంచుకొచ్చాయి. నాలుగు రోజుల నుంచి కాస్తున్న ఎండలకు గుమ్మడి కాయలు వక్కి పోయి, కుళ్ళి పోవటం మొదలు పెట్టాయి. ఇంతా చేసిన రైతుకు వాటిని పారబోయటం తప్పటంలేదు. ఆరుగాలం కష్టపడి పండించిన పంటను నేలపాలు చేయటానికి మనసు నొచ్చుకుంటోందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఒక్కో రైతు ఎకరాకు ఇరవై నుండి ఇరవైఐదు వేల రూపాయలు ఖర్చు చేసినట్లుగా తెలిపారు. మామూలు రోజుల్లో గుమ్మడికాయల ధర టన్ను 7 వేల రూపాయల నుంచి 10 వేల వరకు పలుకుతుందని.. ప్రస్తుతం కొనటానికి కూడా ఎవరు ముందుకు రావడం లేదని రైతులు తల్లడిల్లుతున్నారు.
ఇదీ చదవండి: