సీఎం జగన్‌కు ప్రకాశం జిల్లా తెదేపా ఎమ్మెల్యేలు మరో లేఖ రాశారు. కేంద్ర జలశక్తి శాఖ గెజిట్‌తో ప్రకాశం జిల్లాకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని గొట్టిపాటి రవి, ఏలూరి సాంబశివరావు, బాలవీరాంజనేయస్వామి.. సీఎం జగన్‌కు లేఖ రాశారు. వెలుగొండను అనుమతి లేని ప్రాజెక్టుగా గెజిట్‌లో చూపారని.. వెలుగొండ ప్రాజెక్టును కేంద్రం తన గెజిట్‌లో చేర్చేలా చూడాలని కోరారు. సమస్య పరిష్కరించకుంటే ఆ ప్రాంత ప్రజల తరఫున పోరాటం చేస్తామని హెచ్చరించారు. విభజన చట్టంలో 5 ప్రాజెక్టులే ఉన్నట్లు గెజిట్‌లో పేర్కొన్నారని.. ఇది 2014 నాటి విభజన చట్టానికి పూర్తి విరుద్ధమని పేర్కొన్నారు.
“తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న, పూర్తయిన అయిదు ప్రాజెక్టులను మాత్రమే విభజన చట్టంలో పేర్కొనటం 2014 విభజన చట్టానికి పూర్తి విరుద్ధం. 11వ షెడ్యూల్, సెక్షన్ 85 (7ఈ)లో తెలుగు రాష్ట్రాల్లోని హంద్రీనీవా, తెలుగు గంగ, గాలేరు నగరి, వెలుగొండ, కల్వకుర్తి, నెట్టెంపాడు ప్రాజెక్టులను పూర్తి చేయాలని స్పష్టంగా ఉంది. కేంద్ర గెజిట్‌లో వెలుగొండ మినహా మిగిలిన అయిదు ప్రాజెక్టులను మాత్రమే విభజన చట్టం జాబితాలో చూపించటం ప్రాజెక్టు భవిష్యత్తును అంధకారంలోకి నెట్టింది. ప్రాజెక్టు నిర్మాణం తుదిదశకు చేరుకున్న తరుణంలో ఈ చర్య కరవుతో ఇబ్బంది పడుతున్న ప్రకాశం జిల్లాకు తీవ్రమైన నష్టం కలిగించటంతో పాటు మా ప్రాంతం ఎడారిగా మారే ప్రమాదం ఉంది. రాయలసీమ ఎత్తిపోతల వల్ల మా జిల్లాకు కలిగే నష్టాలు వివరిస్తూ ఇప్పటికే ఈ నెల 11న ఓ లేఖ రాసినా ఇంతవరకూ స్పందన లేదు. వెలుగొండపైనా దృష్టి సారించి ప్రాజెక్టుకు అన్ని అనుమతులు ఉన్నాయని కేంద్రం సమక్షంలో మళ్ళీ గెజిట్ నోటిఫికేషన్ వచ్చేలా చూడాలి. ప్రభుత్వం ఏర్పడిన ఏడాదిలో వెలగొండ పూర్తి చేస్తామని హామీ ఇచ్చి రెండేళ్లయినా ఇంకా పూర్తి చేయకుండా మాట తప్పారు. ఇచ్చిన మాట ప్రకారం ఎలాంటి ఆటంకాలు లేకుండా ప్రాజెక్టుని వెంటనే పూర్తి చేయాలి. రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టుపైనా పునరాలోచన చేయాలి. వెలుగొండ ప్రాజెక్టు భవిష్యత్తుకి, నాగార్జున సాగర్ మనుగడకి ఎలాంటి అన్యాయం జరగకుండా ప్రత్యామ్నాయం చూపి, ప్రకాశం, గుంటూరు జిల్లాల రైతులకు నీరందించాలి” అని లేఖలో డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి:
Ministry of Jal Shakti: విభజన చట్టం ప్రకారమే ఇరు రాష్ట్రాల మధ్య నీటి వాటా: జల్‌శక్తి శాఖ