ప్రకాశం జిల్లా పరిపాలన భవనానికి స్వాతంత్య్ర సమరయోధుడు , త్యాగశీలి.... టంగుటూరి ప్రకాశం పంతులు పేరిట ప్రకాశం భవనంగా నామకరణం చేశారు. సుదీర్ఘ చరిత్ర కలిగిన ఈ భవనానికి ఏళ్లుగా అనేక మరమ్మతులు చేస్తూ వస్తున్నారు. శాఖలను బట్టి ఆయా విభాగాల గదులను ఆధునికీకరించారు. కానీ ప్రజారోగ్యంతో ముడిపడిన, కీలకమైన వైద్యఆరోగ్యశాఖ విభాగ కార్యాలయంపై అధికారులు శీతకన్ను వేశారు. ఇదే ఫ్లోర్‌లో ఓ వైపు వ్యవసాయం, ఖజానా విభాగాలున్నాయి. వీటిల్లో ఎక్కడికక్కడ పెచ్చులూడిన గోడలు, ప్రమాదకరరీతిలో వేలాడే విద్యుత్ తీగలు, స్విచ్ బోర్డులే దర్శనమిస్తున్నాయి. వర్షం వచ్చిన ప్రతిసారీ.. కార్యాలయ గదుల్లోకి నీరు ప్రవేశించి ఉద్యోగులు అవస్థలు పడుతున్నారు. ముఖ్యమైన దస్త్రాలు, సామగ్రిని కాపాడుకోవడం తలకు మించిన భారంగా మారింది.
కార్యాలయంలోని ప్రతి గదిలోనూ కంప్యూటర్లు, ప్రింటర్లు, కెమెరాలు, బీరువాలు వంటి విలువైన సామగ్రి ఉన్నాయి. వర్షం నీటి నుంచి రక్షించేందుకు ప్లాస్టిక్ కవర్లతో వాటిని కప్పి ఉంచారు. ఓ గదిలో సీలింగ్ పూర్తిగా ఊడి పడి ఉన్నా... పట్టించుకోని పరిస్థితి. మరమ్మతులకు ప్రతిపాదనలు సిద్ధమైనా... ఆచరణకు నోచుకోకపోవడంతో... ప్రభుత్వ ఆస్తికి తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఏర్పడింది. జిల్లా పరిపాలన విభాగంలో.... కీలకమైన వైద్యఆరోగ్యశాఖ కార్యాలయానికి ఈ దుస్థితి ఏర్పడటం విస్మయం కలిగిస్తోంది. 30 లక్షల రూపాయలు ఖర్చుచేస్తే... పూర్తిస్థాయిలో ఆధునికీకరించవచ్చని.... ఎవరూ పట్టించుకోకపోవడంతో ఏళ్లుగా ఇలా నెట్టుకొస్తున్నామని సిబ్బంది వాపోతున్నారు.
ఇదీ చదవండి