ప్రకాశం జిల్లా దర్శి మండలం రాజంపల్లి, జముకులదిన్నె గ్రామాల రైతులు నీటి ఎద్దడితో అల్లాడుతున్నారు. రైతులు తమ పొలాల్లో మొదట కంది పైరు వేసుకున్నారు. సాగర్ కాలువ నీరు వస్తుండటంతో కంది పైరును తొలగించి వరి పంట పండించుకోవటానికి సన్నద్ధమయ్యారు. మొదట కాలువల నిండా నీరు వస్తున్నందున నారు పోశారు. నారు ఏతకు వచ్చేసరికి కాలువలో నీరు పూర్తిస్థాయిలో పడిపోవటంతో ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో అల్లాడుతున్నారు.
వారం రోజుల నుంచి ప్రకాశం జిల్లాకు వచ్చే సాగర్ ప్రధాన కాలువలో నీరు తగ్గుముఖం పట్టింది. అందువల్ల మేజర్ కాలువలకు సాగునీరు అందటంలేదు. దర్శి, ఒంగోలు బ్రాంచి కాలువకు 2800 క్యూసెక్కుల నీరు సరఫరా కావలసిఉండగా ప్రస్తుతం 1200 క్యూసెక్కుల నీరు సరఫరా అవుతుంది.
ఈ విషయమై.. దర్శి బ్రాంచి కాలువ డిప్యూటీ ఇంజనీర్ అక్బర్ బాషా మాట్లాడారు. ప్రకాశం జిల్లాకు వచ్చే సాగర్ కాలువలో నీటి సరఫరా తగ్గిందని తెలిపారు. విషయాన్ని పై అధికారులకు తెలియజేశామని 2, 3 రోజుల్లో పూర్తిస్థాయి నీటి సరఫరా జరుగుతుందని తెలిపారు. ప్రస్తుతం వారబంది నియమాలు లేవని.. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు.
ఇవీ చదవండి: