ప్రకాశం జిల్లాలో కరోనా కట్టడిలో కలెక్టర్ పోలా భాస్కర్ కీలకపాత్ర పోషించారు. జిల్లాలో తొలి పాజిటివ్ కేసు నమోదు కాగానే ఇటీవల బదిలీపై వెళ్లిన జేసీ షన్మోహన్, జేసీ-2 నరేంద్రప్రసాద్, స్పెషల్ కలెక్టర్ గంగాధర్ గౌడ్, డిప్యూటీ కలెక్టర్ వసంతబాబు, డీఆర్‌వో వెంకటసుబ్బయ్య, ఒంగోలు, కందుకూరు, మార్కాపురం ఆర్డీవోలు ప్రభాకర్‌రెడ్డి, ఓబులేషు, శేషిరెడ్డి, ఒంగోలు నగర పాలక సంస్థ కమిషనర్ నిరంజన్‌రెడ్డి, డీపీవో నారాయణరెడ్డి, డ్వామా పీడీ శీనారెడ్డి, జడ్పీ సీఈవో కైలాష్ గిరీశ్వర్ తదితర అధికారులతో వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి ప్రణాళిక రచించి అమలు చేస్తున్నారు.
పక్కా లాక్‌డౌన్‌లో ఎస్పీ మార్క్...
జిల్లాలో లాక్‌డౌన్ పకడ్బందీగా అమలయ్యేలా ఎస్పీ సిద్ధార్థ్‌కౌశల్ చర్యలు తీసుకున్నారు. శిక్షణ ఎస్పీ జగదీష్, ఏఎస్పీ శరత్‌బాబు, ఒంగోలు డీఎస్పీ కేవీవీఎన్వీ ప్రసాద్, ఎస్‌బీ-1 టీవీవీ ప్రతాప్‌కుమార్, ఎస్‌బీ-2 సీఐ శ్రీకాంత్‌బాబు తదితర అధికారులకు ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేస్తున్నారు. పాజిటివ్ కేసులున్న ఒంగోలు, చీరాల, మార్కాపురం ఇతర ప్రాంతాల్లో పర్యటించి ప్రజలకు భరోసా ఇచ్చారు.
ఒక్క మరణం లేకుండా...
కరోనాకు ఒక్కరు కూడా బలి కాకుండా వైద్యులు కీలక పాత్ర పోషిస్తున్నారు. డీఎంహెచ్‌వో అప్పలనాయుడు, అడిషనల్ డీఎంహెచ్‌వో పద్మావతి, రిమ్స్ సూపరింటెండెంట్ శ్రీరాములు, కొవిడ్-19 నోడల్ అధికారి జాన్ రిచర్డ్స్ నాణ్యమైన సేవలు అందించడంలో ముఖ్యభూమిక వహిస్తున్నారు. కొవిడ్ వైద్యులు, నర్సులు, ఇతర సిబ్బంది పాజిటివ్ రోగులు కోలుకునేలా మానసిక స్థైర్యాన్ని నింపుతూ క్షేమంగా ఇళ్లకు తిరిగి వెళ్లేలా చూస్తున్నారు.
సిబ్బంది తెగువ...
కరోనా పేరు వింటేనే అందరూ హడలిపోతున్న తరుణంలో కుటుంబాలకు దూరంగా, విధులు నిర్వహించే చోట ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ వాటిని లెక్కచేయక సదరు మహమ్మారిపై ప్రత్యక్ష యుద్ధం ప్రకటించారు.. పోలీసులు, వైద్యులు, పారిశుద్ధ్య కార్మికులు. జిల్లాలో వైద్య, ఆరోగ్య శాఖ నుంచి దాదాపు 1500 మంది, పోలీసు శాఖ నుంచి దాదాపు 3,600 మంది, 2,800 మంది పారిశుద్ధ్య కార్మికులు సైనికుల్లా పోరాడుతున్నారు. రెడ్, ఆరెంజ్ జోన్లు అని తేడా చూపకుండా అన్ని చోట్లలో నిస్వార్ధంగా విధులు నిర్వర్తిస్తున్నారు. రాత్రింబవళ్లు సదా మీసేవలో మేమున్నామంటూ ప్రజలకు భరోసా ఇస్తున్నారు. ఫలితంగా జిల్లాలో క్రియాశీల కేసులు సున్నాకు వచ్చాయి.
ఇవీ చదవండి.. జీడి బట్టీ కార్మికుల లాక్‌డౌన్ కష్టాలు