Ongole town cremation ground issue: ఒంగోలు పట్టణంలో జనావాసాల మధ్య ఉన్న శ్మశానవాటిక అభివృద్ది విషయంలో పాలక వర్గం నిర్లక్ష్యం చూపిస్తోంది. ఆధునిక సౌకర్యాల కల్పనలో అసంపూర్తి పనుల కారణంగా లక్షలాది రూపాయల నిధులు వృథా అయ్యాయని విమర్శలు తలెత్తుతున్నాయి. చుట్టూ జనావాసాలు, ఆసుపత్రులు ఉండటం వల్ల దహన సంస్కరణల సమయంలో ప్రజలు ఇబ్బందులు పడుతున్నా.. నగరపాలక సంస్థ అధికారులు పట్టించుకోవడం లేదు. దహన సంస్కరణ కోసం గ్యాస్ ఆధారిత యంత్రాలు ఏర్పాటు చేసినా, వాటిని వినియోగంలోకి తీసుకురావడం లేదని విమర్శిస్తున్నారు.
ఒంగోలు పట్టణ నడిబొడ్డులో ఆర్టీసి బస్టాండ్‌కు ఆనుకొని, జనావాసాల మధ్యనున్న మహాప్రస్థానం నిర్లక్ష్యానికి గురవుతోంది. నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ శ్మశాన వాటిక నిర్వహణ విషయంలో పాలక వర్గం దృష్టి సారించడం లేదు. దాదాపు 100 సంవత్సరాలు చరిత్ర కలిగిన ఈ మహాప్రస్థానం.. గతంలో ఒంగోలు పట్టణ అభివృద్ధి సమితి ఆధ్వర్యంలో 50 లక్షల రూపాయలతో అభివృద్ధి పరిచారు. చెట్లు, తుప్పలతో, ఆక్రమణలకు గురయిన ఈ మహాప్రస్థానం అభివృద్ధి సమితి పుణ్యమా అని కొన్ని సౌకర్యాలు కల్పించినా, నిర్వహణ విషయంలో ఈ సమితికి, నగర పాలక సంస్థకు సమన్వయం లేక కొన్నాళ్లు మళ్లీ నిర్వహణకు నోచుకోలేదు.
దీంతో పట్టణంలో ఎవరైనా మరణిస్తే.. ఇక్కడే దహన సంస్కరణలు చేపట్టడం వల్ల చుట్టు ప్రక్కల నివాసమున్న వారికి తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయి. ప్రయివేట్ ఆసుపత్రులు, ఆర్టీసి కాంప్లెక్స్ కూడా ఉండటం వల్ల దుర్గంధం వెదజల్లి తీవ్ర అసౌకర్యంగా ఉందని ఫిర్యాదులు వచ్చాయి. ప్రత్యమ్నాయంగానీ, ఎలక్ట్రానిక్ క్రినినేటర్లు గానీ ఏర్పాటు చేయలేదు.
కొవిడ్ సమయంలో దహన సంస్కరణకు మృతదేహాలు పెద్ద సంఖ్యలో రావడంతో మరింత సమస్య ఎదురయ్యింది. పోలీసులను పెట్టి సంస్కరణలు చేపట్టారు. ఆ సమయంలో గ్యాస్ క్రిమటోరియం ఏర్పాటు చేయాలనే డిమాండ్ రావడం, కేంద్రం నిధులు మంజూరి చేయడంలో కోటి 67లక్షల రూపాయలతో నిర్మాణ పనులు ప్రారంభించారు. ఇందుకు సంధించిన యంత్ర సామగ్రి కూడా ఏర్పాటు చేశారు. అయితే.. గ్యాస్ యూనిట్లు మాత్రం ఏర్పాటు చేయాలేదు. దాదాపు 80 శాతం పనులు పూర్తయి అసంపూర్తి పనులుగా మిగిలిపోయి, వినియోగంలోకి రావడం లేదు. యథావిధిగా దహన సంస్కరణలు చేపడుతున్నారు. నగరపాలిక సంస్థ అధికారులు తక్షణం స్పందించి, గ్యాస్ క్రిమటోరియం అందుబాటులోకి తీసుకురావాలని పలువురు కోరుతున్నారు.
ఇవీ చదవండి