ప్రకాశం జిల్లా దర్శిలో పసిపాప కిడ్నాప్‌నకు గురైంది. దొనకొండ మండలం పోలేపల్లికి చెందిన మరియమ్మ నెల కిందట ఓ పసిపాపకు జన్మనిచ్చింది. బుధవారం ఉదయం మరియమ్మ వద్దకు ఓ మహిళ వచ్చి... తాను ఆరోగ్య కార్యకర్తను అని, మార్కాపురం నుంచి బదిలీపై వచ్చాను అని చెప్పింది. మీకు జగనన్న కానుక వస్తుందని, దర్శి వస్తే అక్కడ ఆన్లైన్ చేయించి పంపుతామని నమ్మబలికింది. మరియమ్మతో పాటు మరో నలుగురికి చెప్పి వాళ్లని వెంటబెట్టుకొని దర్శికి చేరారు.
దర్శి వెళ్లిన తరువాత మరియమ్మతో పాటు వచ్చిన ముగ్గురిని వేరేచోట ఉంచి... మరియమ్మతో దర్శి సెంటర్లోని గడియారం స్తంభం వద్ద ఉన్న ఓ స్థూడియోని చూపించి ఫొటో దిగిరా.. పాపని చూసుకుంటానని చెప్పింది. మరియమ్మ తన పాపను ఆమెకిచ్చి ఫొటో దిగిరావటానికి వెళ్లింది. అదే అదునుగా ఆ మహిళ పాపను తీసుకొని వెళ్లిపోయింది. ఫొటో దిగి వచ్చిన మరియమ్మ... పాప, ఆ మహిళ కనపడకపోయేసరికి లబోదిబోమంటూ ఏడ్చింది. పోలీసులను ఆశ్రయించి విషయం చెప్పింది.
సీఐ మహమ్మద్ మొయిన్ ఆధ్వర్యంలో సర్కిల్ పరిధిలోని ఎస్సైలకు సమాచారం అందించారు. అప్రమత్తమైన ఎస్సైలు గాలింపు చర్యలు చేపట్టారు. ముండ్లమూరు ఎస్సై ఉల్లగల్లు వద్ద విచారించగా.. ఓ పసిపిల్లను ఎత్తుకొని ఓ మహిళ ఆటోలో వెళ్లిందని అని చెప్పగా.. ఎస్సై హుటాహుటిన తరలివెళ్లి గుంటూరు జిల్లా నూజిండ్ల మండలం ఉప్పలపాడు వద్ద ఆటోను ఆపి ఆమెను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇదీ చదవండి: