Municipal Commissioner issued notices in Kanigiri: సామాన్య ప్రజలు ప్రభుత్వానికి పన్నులు చెల్లించడంలో జాప్యం చేస్తే అధికారులు హడావిడి చేస్తారు. అయితే ఇక్కడ మాత్రం అధికారులు.. ప్రభుత్వ కార్యాలయాలకు ఆ నిబంధనలు వర్తించవనుకున్నారేమో.. లేదా.. పన్నులు చెల్లించకపోతే తమను ఎవరు ప్రశ్నిస్తారులే అనుకున్నారో ఏమో కానీ.. పన్నులు చెల్లించడం మానేశారు. తీరా ఆ బకాయిలు ఇంతింతై వటుడింతై అన్న చందంగా కోట్ల రూపాయలు పేరుకుపోయాయి. మున్సిపాలిటీ ఏర్పడిన దగ్గరినుంచి ఇప్పటి వరకు పన్ను చెల్లించకపోవడంతో రూ.1 కోటి వరకు బకాయిలు పడ్డాయి ఆయా ప్రభుత్వ కార్యాలయాలు. విషయాన్ని సీరియస్గా తీసుకున్న కమిషనర్ పన్నుల వసులో కోసం తానే రంగంలోకి దిగారు. ఆయా ప్రభుత్వ కార్యాలయాలకు స్వయంగా వెళ్లి బకాయిలపై నోటీసులు ఇచ్చిన ఘటన ప్రకాశం జిల్లా కనిగిరి పట్టణంలో చోటు చేసుకుంది.
ప్రకాశం జిల్లా కనిగిరి పట్టణంలోని పలు ప్రభుత్వ కార్యాలయాలకు పన్ను చెల్లించాలంటూ మున్సిపల్ కమిషనర్ నారాయణరావు ఆయా కార్యాలయాల అధికారులకు నోటీసులు అందజేశారు. కనిగిరి మున్సిపాలిటీగా ఏర్పడినప్పటినుండి పట్టణంలోని పలు ప్రభుత్వ కార్యాలయాలు మున్సిపల్ కార్యాలయానికి చెల్లించాల్సిన పన్ను బకాయిలు చెల్లించడం లేదని పేర్కొన్నారు. ఈ పన్నులు కోటి రూపాయల వరకు ఉందని తెలిపారు. అందుకుగాను రోడ్లు, భవనాల శాఖ, తహసీల్దార్, ఆర్డీవో, విద్యుత్ శాఖ కార్యాలయాలకు మున్సిపల్ పన్ను చెల్లించాలని స్వయంగా నగర పంచాయతీ కమిషనర్ డిమాండ్ నోటీసులను ఆయా కార్యాలయాల అధికారులకు అందజేశారు. కనిగిరి పట్టణవ్యాప్తంగా ప్రభుత్వ, వ్యాపార, నివాస గృహాలకు సంబంధించి మొత్తంగా నాలుగు కోట్ల రూపాయల పాత మొండి బకాయిలు ఉన్నట్లు గుర్తించినట్లు కమిషనర్ వెల్లడించారు. ఆ పన్ను బకాయిల్లో ముఖ్యంగా ప్రభుత్వ కార్యాలయాలకు సంబంధించినవే రూ.1కోటి రూపాయల వరకు ఉందన్నారు.
ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ నారాయణరావు మాట్లాడుతూ కనిగిరి పట్టణంలోని పలు ప్రభుత్వ శాఖలకు సంబంధించి పన్ను రూపేణా అధిక మొత్తంలో ఉందని, అందుకుగాను తానే స్వయంగా నోటీసులు అందజేస్తున్నానని తెలిపారు. సకాలంలో పన్ను చెల్లించపోతే శాఖాపరమైన చర్యలు చేపడతామని కమిషనర్ తెలిపారు. ఇకపై సకాలంలో పన్ను చెల్లించకపోతే మున్సిపల్ శాఖ నుంచి అందించే సేవలను నిలపడంతో పాటు ఆయా ఆస్తులను సైతం జప్తు చేస్తామన్నారు.
ఇవీ చదవండి: