Rains in the state: వచ్చే 3 రోజులు రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు, పిడుగులు పడతాయని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది. ఉత్తర తమిళనాడు నుంచి కర్ణాటక మీదగా కొంకణ్ తీరం వరకు ద్రోణి విస్తరించి ఉన్నట్లు తెలిపింది. సముద్రమట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ద్రోణి కొనసాగుతుండగా.. శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని తెలిపింది. శనివారం శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు పడతాయని సూచించింది.
విశాఖ, అల్లూరి, మన్యం జిల్లాల్లో అక్కడక్కడ.. అనకాపల్లి, కాకినాడ, జిల్లాల్లో కొన్నిచోట్ల వర్షాలు పడతాయని తెలిపింది. తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కోనసీమ, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, ప్రకాశం జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలకు అవకాశం ఉన్నట్లు వెల్లడించింది. గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు పడతాయని తెలిపింది. ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్ష సూచన ఉన్నట్లు తెలిపింది. పిడుగులు పడతాయని.. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది.
పల్నాడు జిల్లా మాచర్ల మండలం విజయపురి సౌత్ సమీపంలో పిడుగు పాటుకు గురై ఓ బాలుడు, 40 మేకలు మృతి చెందాయి. చింతల తండా గ్రామానికి చెందిన రామవత్ సైదా నాయక్(17).. తమ 40 మేకలను తోలుకొని విజయ పురి సౌత్ సమీప ప్రాంతానికి మేత మేపేందుకు వెళ్లాడు. ఉన్నట్టుండి ఉరుములు, మెరుపులతో వర్షం పడటంతో చెట్టు కిందకు వెళ్లి ఉండగా.. పిడుగు పడి అక్కడికక్కడే మృతి చెందాడు. అతనితో పాటు మన్నానయక్ అనే వ్యక్తికి గాయాలు కాగా 40 మేకలు చనిపోయాయి. జరిగిన ఘటనపై అధికారులు విచారణ చేస్తున్నారు.
ఒక్కసారిగా మారిపోయిన వాతావరణంతో పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం రైతులు ఆందోళన చెందుతున్నారు. కోతలు పూర్తై కళ్లాల్లో ఆరబెట్టిన మిర్చిపై పట్టాలు కప్పి కాపాడుకుంటున్నారు. వర్షానికి తడచి నష్టపోకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
ప్రకాశం జిల్లాలో పిడుగు పడి ఒకరు మృతి : ప్రకాశం జిల్లా త్రిపురాంతకం, మార్కాపురం, యర్రగొండపాలెంలో ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. వాతావరణం ఒక్కసారిగా మారి ఉన్నట్టుండి గాలులతో కూడిన వర్షం కురిసింది. త్రిపురాంతకంలోని విద్యుత్ కార్యాలయంలో ఆవరణలో గాలుల ధాటికి చెట్టు కొమ్మలు విరిగి అక్కడే ఉంచిన సిబ్బందికి సంబంధించిన ద్విచక్రవాహనాలపై పడ్డాయి. పలు ద్విచక్రవాహనలు దెబ్బతిన్నాయి. చెట్ల కొమ్మలు తప్పించి వాహనాలు పక్కకు తీశారు. యర్రగొండపాలెం మండలం గొల్లవిడిపిలో ఓ పొలంలో పిడుగు పడి ఒకరు మృతి చెందారు. మార్కాపురం మండలంలో వడగళ్ల వాన పడింది.
అల్లూరి జిల్లాలో ఉపాధ్యాయుడు మృతి: అల్లూరి జిల్లాలో పెదబయలు, ముంచంగిపుట్టు, హుకుంపేట, డుంబ్రిగుడ మండలాల్లో ఉరుములతో వడగళ్ల వర్షం పడింది. చింతూరు మండలం సుద్దగూడెంలో జరిగిన ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. గాలివానకు తలుపు మీద పడి ప్రైవేటు ఉపాధ్యాయుడు మృత్యువాత పడ్డారు.
ఉమ్మడి కర్నూలు జిల్లాలో సాయంత్రం నుంచి వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. పలు చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. గడివేముల, కర్నూలు నగరంలోని కొన్ని ప్రాంతాల్లో వడగళ్లు కురిశాయి. అకాల వర్షాల వల్ల.. ఎండలతో అల్లాడుతున్న ప్రజలకు కాస్తంత ఉపశమనం లభించినట్లైంది.
విజయనగరం జిల్లాలో పలు మండలాల్లో వర్షం కురిసింది. దత్తిరాజేరు, బొబ్బిలి, తెర్లాం, బొండపల్లి, మెరకముడిదాం మండలాల్లో చిరుజల్లులు కురిసాయి. మన్యం జిల్లాలో వీరఘట్టం, పార్వతీపురం, పాలకొండ, బలిజిపేట, కొమరాడ మండలాల్లో మండలాల్లో వర్షం కురిసింది. కురుపాం, గుమ్మలక్ష్మీపురంలో ఉరుములతో కూడిన వర్షం పడింది. వర్షం కారణంగా పలుచోట్ల విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.
ఇవీ చదవండి: