ప్రకాశం జిల్లా కనిగిరి నిమ్మ, బత్తాయిలంటే మార్కెట్‌లో మంచి గిరాకీ ఉంది. ఇక్కడనుంచి రాష్ట్రంలో పలు జిల్లాలకే కాకుండా.. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు సైతం ఎగుమతి చేస్తుంటారు. ఎకరాకు రూ.30, 40 వేలు పెట్టుబడి పెట్టి సాగుచేసిన రైతుకు ఏడాదికి దాదాపు లక్షల రూపాయలు మిగిలేవి. అలాంటిది ఇప్పుడు పరిస్థితులు తారుమారయ్యాయి... తీవ్ర వర్షా భావపరిస్థితులు కారణంగా సాగునీరు లేక అల్లాడిపోతున్నారు. బోరుబావులలో నీరు అడుగంటి రైతులు దిగాలుపడుతున్నారు. జిల్లాలో దాదాపు లక్ష ఎకరాల్లో నిమ్మ తోటలు, బత్తాయి తోటలు ఉన్నాయి. ప్రస్తుతం ఈ తోటలకు వర్షాభావ పరిస్థితులు వెంటాడుతున్నాయి. ఒకటి, రెండు ఎకరాల తోటకు 7, 8 చోట్ల బోర్లు తవ్వినా.. నీరు రాకపోవడంతో వదిలేస్తున్నారు. నీటి కోసం లక్షలు అప్పులు చేసినా ఫలితం లేదని రైతులు వాపోతున్నారు.
తోటలను బతికించుకునేందుకు రైతులు సొంత ఖర్చుతో ట్యాంకర్ల ద్వారా నీరందించినా ఫలితం లేకపోయింది. జల వనరులు సన్నగిల్లడంతో ఎక్కడా నీరులేని పరిస్థితి ఏర్పడి, ట్యాంకుల ద్వారా నీటిని సరఫరా చేయడానికి వీలు లేకుండా పోయింది. వేల రూపాయలు పెట్టుబడులు పెట్టి, తీరా పంట చేతికి రాకపోతే అంతా నష్టపోవలసి వస్తుందని భయపడి తోటల్ని వదిలేస్తున్నారు. లక్షలు పెట్టుబడి పెట్టి తోటల్ని పెంచుతున్న తమకు, దిగుబడి సమయానికి సాగునీరు లేక నిండా మునిగామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చదవండి