LAWYERS PROTEST : తన కుమార్తె లైంగిక వేధింపులకు గురవుతున్నట్లు ఫిర్యాదు చేసేందుకు పోలీస్‌స్టేషన్‌కు వెళ్లిన న్యాయవాదిపైనే కేసు నమోదు చేసిన ఘటన విజయవాడలో జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఆ ఘటనపై రాష్ట్రవ్యాప్తంగా న్యాయవాదులు ఆందోళనలు చేపట్టారు. పలుచోట్ల విధులు బహిష్కరించి రోడ్లపై ధర్నాలు, నిరసనలు చేస్తున్నారు. తాజాగా ప్రకాశం జిల్లాలో లాయర్లు సైతం నిరసనలు చేశారు.
విజయవాడలో.. ఫిర్యాదు చేయడానికి వచ్చిన న్యాయవాది పైనే కేసు పెట్టిన సీఐ ఉమర్‌ను సస్పెండ్ చేయాలంటూ కనిగిరిలో న్యాయవాదులు.. విధులు బహిష్కరించారు. కనిగిరి సివిల్ జడ్జి కోర్టు ఆవరణలో నిరసన తెలిపారు. పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించి న్యాయవాది పైనే కేసు నమోదు చేయడం హేయమైన చర్య అని వారు మండిపడ్డారు. న్యాయవాదికే న్యాయం చేయలేని పోలీసులు.. సామాన్యులకు ఏం చేస్తారని నిలదీశారు. ఇప్పటికైనా అత్యుత్సాహం ప్రదర్శించిన సంబంధిత అధికారులపై శాఖ పరమైన చర్యలు తీసుకోవాలని.. లేదంటే న్యాయవాదికి న్యాయం జరిగేంత వరకు ఇలానే విధులను బహిష్కరించి నిరసన తెలియజేస్తామని వారు హెచ్చరించారు.
వీఆర్‌కు సీఐ ఉమర్: భవానీపురం సీఐ ఎండీ ఉమర్‌ను వీఆర్‌కు పంపుతూ నగర పోలీసు కమిషనర్ కాంతి రాణా ఉత్తర్వులు జారీ చేశారు. ఇటీవల భవానీపురం హెచ్‌బీ కాలనీకి చెందిన బాలికతో సమీపంలో నివాసం ఉండే యువకుడు అభ్యంతరకరంగా ప్రవర్తించాడు. దీంతో న్యాయవాది అయిన బాలిక తండ్రి యువకుడిని కొట్టారు. పోలీసులకు బాలిక తండ్రి ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేయకుండా వారిని దిశ పోలీసు స్టేషన్‌కు పంపారు. బాలిక తండ్రిపై యువకుడి తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అందుకున్న భవానీ పురం పోలీసులు బాలిక తండ్రిపై కేసు నమోదు చేశారు. దీనిపై న్యాయవాద సంఘాల నుంచి తీవ్రమైన ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి.
మూడు రోజుల కిత్రం విజయవాడలో సివిల్ కోర్టుల వద్ద న్యాయవాదులు పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. ఉమర్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బాలిక తండ్రిపై ఏ విధంగా కేసు నమోదు చేస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసు కమిషనర్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. దీనిపై అత్యవసరంగా స్పందించిన సీపీ సెలవుపై వెళ్లాలంటూ ఉమర్ కు ఆదేశాలు జారీ చేశారు. అనంతరం ఈ ఘటనపై విచారణ చేసిన పోలీసు కమిషనర్ ఉమర్‌ను వీఆర్‌కు పంపుతూ నిర్ణయం తీసుకున్నారు. భవానీపురం స్టేషన్ ఇంఛార్జ్ సీఐగా వన్ టౌన్ సీఐ సురేష్ రెడ్డికి అప్పగించారు. ఇప్పటికూడా పలు చోట్ల న్యాయవాదులు ఆందోళనలు చేపడుతూనే ఉన్నారు. సీఐపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. తాజాగా ప్రకాశం జిల్లా కనిగిరిలో న్యాయవాదులు విధులు బహిష్కరించి నిరసనలు చేపట్టారు.
ఇవీ చదవండి: