ప్రకాశం జిల్లా బేస్తవారిపేట మండలంలోని సింగరపల్లిలో సోమవారం ఈ సంఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన బండ్ల వెంగయ్య (45) ప్రైవేటు ట్రావెల్స్ బస్సు డ్రైవరుగా పని చేస్తూ పామూరులో నివాసం ఉంటున్నారు. సంక్రాంతి సందర్భంగా ఇటీవల సొంతూరుకు వచ్చారు. గ్రామంలో పారిశుద్ధ్యం అధ్వానంగా ఉందని, సమస్యను పరిష్కరించాలని కోరుతూ శుక్రవారం ఎమ్మెల్యే అన్నా రాంబాబు కారును ఆయనతోపాటు మరికొందరు జనసేన కార్యకర్తలు అడ్డగించారు. దీంతో ఎమ్మెల్యే వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సంఘటన అనంతరం గ్రామంలో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. సమస్యను చక్కదిద్దేందుకు తమ నాయకులు ఆదివారం స్థానికంగా ఉన్న వైకాపా నాయకుల వద్దకు వెళ్లగా వారు దౌర్జన్యానికి దిగి, వెంగయ్య పట్ల అనుచితంగా ప్రవర్తించారని జనసేన నియోజకవర్గ ఇన్‌ఛార్జి బెల్లంకొండ సాయిబాబు ఆరోపించారు. దీంతో మనస్తాపానికి గురై సోమవారం అతను పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు చెప్పారు. దీనిపై సీబీఐతో విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు పార్టీ అధినేత పవన్ కల్యాణ్ త్వరలో ఇక్కడికి వస్తారన్నారు.
మద్యం తాగొద్దన్నందుకే...
వెంగయ్య మృతిపై కుటుంబ సభ్యుల వివరణ మరోలా ఉంది. మద్యం తాగొద్దని చెప్పినందుకే తీవ్ర మనస్తాపానికి గురయ్యాడన్నారు. ఈ మేరకు సోమవారం ఆత్మహత్యకు పాల్పడే ముందు తమకు ఫోన్ చేశాడని మృతుడి అన్న వెంకటేశ్వర్లు చెప్పారు. వెంటనే తాము సంఘటనాస్థలికి వెళ్లి అక్కడినుంచి బాధితుడిని గలిజేరుగుళ్లలోని ప్రైవేటు వైద్యుని వద్దకు తీసుకెళ్లగా, అప్పటికే మృతి చెందినట్లు ఆయన చెప్పారన్నారు.
ప్రశ్నిస్తే ప్రాణాలు కోల్పోవాల్సిందేనా?
కనీస పారిశుద్ధ్య సౌకర్యాలపై ప్రశ్నిస్తే ప్రాణాలు కోల్పోవాల్సిందేనా అని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. ‘గిద్దలూరు ఎమ్మెల్యే బెదిరింపులతోనే జనసేన కార్యకర్త బండ్ల వెంగయ్య నాయుడు ఆత్మహత్య చేసుకున్నట్లు మాకు సమాచారం ఉంది. బెదిరింపులతో యువకుడిని ఆత్మహత్యకు ప్రేరేపించిన వైకాపా ఎమ్మెల్యే అన్నా రాంబాబు సహా ఆయన అనుచరులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి’ అని డిమాండు చేశారు. ఈ మేరకు సోమవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.
ఇదీ చదవండి: నేడు దిల్లీకి సీఎం జగన్... అమిత్ షాను కలిసే అవకాశం