కరోనా కారణంగా అర్ధాంతరంగా మూతపడిన గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లోని నిత్యావసర వస్తువులు పాడవ్వకుండా ఐటీడీఏ, గిరిజన సంక్షేమశాఖ అధికారులు ముందస్తు చర్యలు చేపడుతున్నారు. గతేడాది కరోనా కారణంగా మూతపడిన గిరిజన సంక్షేమ విద్యా సంస్థల్లో రూ.లక్షలాది విలువ చేసే నిత్యావసర వస్తువులు పాడవడం, వాటిని తగులబెట్టడం, దీనిపై ఆదివాసీ సంక్షేమ పరిషత్ రాష్ట్ర సహాయక కార్యదర్శి వాబ యోగీశ్వరరావు(యోగి) హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం(పిల్) దాఖలు చేయడం తెలిసిందే. అది పునరావృతం కాకుండా ముందస్తుగా ఒక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
పది మినహా అందరికీ సెలవే..
ఆశ్రమ పాఠశాలల్లో పదో తరగతి మినహా మిగతా అందరు విద్యార్థులకు కరోనా తీవ్రతతో ఇప్పటికే వేసవి సెలవులు ఇచ్చారు. ఇప్పటికే తొమ్మిదో తరగతి వరకు సెలవులు ఇచ్చేయగా, శనివారం నుంచి పదో తరగతికీ సెలవులు ఇచ్చేశారు. దీంతో ఆయా పాఠశాలల్లో ఇప్పటికే నిల్వలు ఉన్న నిత్యావసర సరకులను పోస్టుమెట్రిక్ వసతిగృహాలకు అవసరం మేరకు ఇచ్చేలా చర్యలు చేపడుతున్నారు. ఇప్పటికే బుడగరాయి, భామిని, చీపి, లొత్తూరు, నౌగూడ, టెక్కలి, మనుమకొండ తదితర ఆశ్రమోన్నత పాఠశాలల్లోని నిత్యావసర సరకులు(కందిపప్పు, పెసరపప్పు, శనగలు, మినపగుండ్లు, కోడిగుడ్లు, మసాలా సామగ్రి, నూనె, ఇతరత్రా) పోస్టు మెట్రిక్ వసతి గృహాలకు అందజేసేలా అధికారులు సూచనలు చేశారు. ఇప్పటికే పలువురు వార్డెన్లు ఆయా వసతి గృహాలకు తెచ్చి అందించేశారు కూడా.. ఆశ్రమోన్నత పాఠశాలల సరకులు సర్దుబాటు అయ్యాక మిగతా పాఠశాలల సరకులు తీసుకునేలా ప్రణాళికలు తయారు చేస్తున్నారు. ఐటీడీఏ పరిధిలోని 47 ఆశ్రమ పాఠశాలల్లోనూ నిత్యావసర సరకుల నిల్వలున్నాయి.
జీసీసీకి అందజేస్తే మేలంటున్న నిర్వాహకులు
ప్రస్తుతం ఆశ్రమ పాఠశాలలకు సరఫరా చేసిన సరకులు గిరిజన సహకార సంస్థ(జీసీసీ) ద్వారా ఇచ్చినవే. ఈ నేపథ్యంలో నిల్వలు పోస్టు మెట్రిక్ వసతి గృహాలకు కాకుండా జీసీసీకే ఇస్తే మేలని నిర్వాహకులు అంటున్నారు. కరోనా తీవ్రత ఎక్కువ ఉన్నందున ఏ క్షణంలో అయినా కళాశాలలు మూతపడితే జిల్లాలోని 16 పోస్టు మెట్రిక్ వసతిగృహాలూ మూతపడతాయి. అదే జరిగితే వసతిగృహాల్లోని సరకులు పాడవుతాయి. అప్పుడు దానికి బాధ్యులెవరవుతారని వసతి గృహ సంక్షేమాధికారుల్లో భయం నెలకొంది. జీసీసీ ఎలాగూ వ్యాపారం చేసే సంస్థ కనుక ఐటీడీఏ పరిధిలోని అన్ని ఆశ్రమ పాఠశాలల్లో మిగిలి ఉన్న నిత్యావసర వస్తువులను తూకం వేసి జీసీసీకి అందజేస్తే సరకులు పాడవ్వకుండా ఉండడంతో పాటు, మళ్లీ విద్యా సంస్థలు తెరిస్తే తాజా సరకులు పొందే వీలుంటుంది.
తక్షణ నిర్ణయం అవసరం
అధికారులు ఏ నిర్ణయమైనా తక్షణం తీసుకోవాల్సిన అవసరముంది. జీసీసీకి అప్పజెప్పడం ద్వారా విద్యా సంస్థల నిర్వాహకులకు ఎలాంటి ఇబ్బంది ఉండదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ పనిచేయడమే ఉత్తమమని గతంలోలాగా అభాసు పాలయ్యే అవకాశమూ తప్పుతుందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.
మిగులు వివరాలు తీసుకున్నాం
ఆశ్రమ పాఠశాలలు, వసతి గృహాల నుంచి మిగులు వివరాలు తీసుకున్నాం. ఏడు ఆశ్రమోన్నత పాఠశాలల్లోని నిత్యావసర వస్తువులను పోస్టు మెట్రిక్ వసతి గృహాలకు ఇచ్చేలా చర్యలు చేపడుతున్నాం. మిగతా ఆశ్రమ పాఠశాలల్లో సుమారు రూ.15 లక్షల విలువ చేసే నిత్యావసరాల నిల్వలు ఉన్నాయి. పది, ఇంటర్ పిల్లలు సుమారు 3,900 మంది వరకు ఉంటారు. వారికి ఎంత సరుకులు అవసరం అవుతాయి, మిగతా సరుకులు ఏమి చేయాలి అనే దానిపై ఐటీడీఏ పీవో ఆదేశాల మేరకు తగు చర్యలు తీసుకుంటాం. జీసీసీ నుంచి వచ్చిన సరుకులే కనుక వారు తీసుకుంటే ఎలాంటి ఇబ్బంది ఉండదు. లేదంటే ప్రత్యామ్నాయ చర్యలు చేపడతాం.
- శ్రీనివాసరావు, ఉప సంచాలకులు(డీడీ)(ఎఫ్‌ఏసీ), గి.స.శాఖ, సీతంపేట
ఇదీ చదవండి