తెలుగు రాష్ట్రాల్లో పలు ప్రజాసంఘాల ప్రతినిధులపై జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) దర్యాప్తు ముమ్మరం చేసింది. తెలంగాణలో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మెదక్ జిల్లాలతో పాటు ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం, గుంటూరు, ప్రకాశం, శ్రీకాకుళం, కర్నూలు, కృష్ణా, తూర్పుగోదావరి, కడప జిల్లాల్లోని 31 ప్రాంతాల్లో బుధవారం మొదలైన సోదాలు గురువారం ఉదయం వరకు కొనసాగాయి. తనిఖీల్లో భాగంగా 40 సెల్‌ఫోన్‌లు, 44 సిమ్‌కార్డులు, 70 హార్డ్‌డిస్క్, మైక్రో ఎస్‌డీ కార్డులు, ఫ్లాష్‌కార్డులు, 184 సీడీ/డీవీడీలు, 19 పెన్‌డ్రైవ్‌లు, ట్యాబ్, ఆడియో రికార్డర్, రూ.10 లక్షల నగదు, విప్లవసాహిత్యం, మావోయిస్టుల పత్రిక ప్రకటనలు, మావోయిస్టులు చేతితో రాసిన లేఖలు స్వాధీనం చేసుకున్నట్లు ఎన్‌ఐఏ గురువారం ఒక ప్రకటనలో పేర్కొంది. ఓ ఇంట్లో వేటకొడవలి, గొడ్డలి, కత్తి లభ్యమైనట్లు వెల్లడించడం గమనార్హం. మావోయిస్టులకు సమాచారం చేరవేస్తూ కొరియర్‌గా పనిచేస్తున్నాడనే ఆరోపణలతో విశాఖ గ్రామీణ జిల్లా ముంచంగిపుట్టు స్టేషన్ పరిధిలో పాంగి నాగన్న అనే విలేకరిని పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ దర్యాప్తులో లభ్యమైన అంశాల ఆధారంగా గత నెల 7న కేసు నమోదు చేసిన ఎన్‌ఐఏ తాజాగా దర్యాప్తు ముమ్మరం చేసింది. పాంగి నాగన్నతో పాటు అండలూరి అన్నపూర్ణ, జంగాల కోటేశ్వరరావు, మానుకొండ శ్రీనివాసరావు, రేల రాజేశ్వరి, బొప్పూడి అంజమ్మను అరెస్ట్ చేసినట్లు ఎన్‌ఐఏ వెల్లడించింది. ఈ సోదాల అనంతరం పలువురు ప్రజాసంఘాల ప్రతినిధులకు నోటీసులు జారీ చేసి విచారణకు హాజరు కావాలని ఆదేశించడంతో ఉత్కంఠ నెలకొంది. ఏపీలో పౌరహక్కుల సంఘాల నేతలు వి.చిట్టిబాబు, చిలుకా చంద్రశేఖర్, నంబూరి శ్రీమన్నారాయణ, టి.ఆంజనేయులు తదితరులు విజయవాడలో ఎన్‌ఐఏ క్యాంపు కార్యాలయంలో గురువారం విచారణకు హాజరై.. దర్యాప్తు అధికారుల ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. మరికొందరిని విచారణకు విశాఖపట్టణానికి రావాలని ఆదేశించినట్లు సమాచారం.
ప్రశ్నించే గొంతులపై దాడులు: పౌరహక్కుల సంఘం
తెలుగు రాష్ట్రాల్లో పౌరహక్కుల సంఘం, విరసం, ఇతర ప్రజాసంఘాల నాయకుల ఇళ్లపై ఎన్‌ఐఏ పథకం ప్రకారం దాడులు చేసిందని, ఇది అప్రజాస్వామికమని నాయకులు అన్నారు. ప్రజలకు జరుగుతున్న అన్యాయాలపై స్పందిస్తున్న ప్రజాసంఘాల నాయకులపై ఎన్‌ఐఏ అప్రజాస్వామిక దాడులు చేస్తోందని తెలంగాణ పౌరహక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు లక్ష్మణ్ గడ్డం, ఎన్.నారాయణరావు, పౌరహక్కుల సంఘం ఏపీ అధ్యక్షుడు కె.ఏసు, ప్రధాన కార్యదర్శి వి.హనుమంతరావు ,కార్యదర్శి జల్ల లింగయ్య ఆరోపించారు. గురువారం సోమాజిగూడలోని ప్రెస్‌క్లబ్‌లో వారు మాట్లాడారు. ప్రభుత్వాల తప్పులను ఎత్తి చూపకుండా ప్రజాసంఘాల నాయకులను లక్ష్యంగా చేసుకుని ఎన్‌ఐఏను బలమైన శక్తిగా వాడుకుంటున్నారని ఆరోపించారు. అన్యాయానికి గురైన వారి పక్షాన న్యాయస్థానంలో కేసులు వేస్తున్న న్యాయవాదుల ఇళ్లలోనూ సోదాలు చేస్తున్నారన్నారు.
మాకు బతికే హక్కు లేదా?: ఆర్కే సతీమణి శిరీష
ప్రజాస్వామ్యంలో బతికే హక్కు తమకు లేదా అని మావోయిస్టు పార్టీ అగ్రనేత అక్కిరాజు హరగోపాల్ అలియాస్ ఆర్కే సతీమణి శిరీష ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఒకవైపు మావోయిస్టులను జనజీవన స్రవంతిలో కలవాలని చెబుతూ.. మరోవైపు తనిఖీల పేరుతో ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం ఆలకూరపాడులో ఆమె గురువారం విలేకరులతో మాట్లాడారు. బుధవారం రాత్రి తన నివాసంలో ఎన్‌ఐఏ అధికారులు సుమారు 6 గంటలు, గురువారం ఉదయం మరో గంట తనిఖీలు చేశారన్నారు. తన వద్ద నుంచి ఆరు పుస్తకాలు, రెండు సెల్‌ఫోన్లు, ఒక పెన్‌డ్రైవ్ స్వాధీనం చేసుకున్నట్టు వివరించారు. ఎన్‌ఐఏ అధికారుల నోటీసుల మేరకు ఈ నెల 5న విచారణకు హాజరవుతానని ఆమె చెప్పారు.
ఇదీ చూడండి. తెలుగు రాష్ట్రాల్లోని 31 ప్రాంతాల్లో సోదాలు చేశాం: ఎన్‌ఐఏ