గత ఏడాది కొవిడ్ లాక్‌డౌన్ కాలంలో దాదాపు మూడు నెలల పాటు పరిశ్రమలు మూతపడ్డాయి. సంబంధిత కాలానికి తాము చెల్లించిన విద్యుత్తు రుసుముల్లో కనీస ఛార్జీలను వెనక్కి ఇస్తామన్న ప్రభుత్వ హామీ ఇంతవరకు నెరవేరక నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉత్పత్తి, వ్యాపారం లేక ఇబ్బందులు పడుతున్నామని వారంతా అంటున్నారు. 2020లోనే ఈ బకాయిలను చెల్లిస్తామని చెప్పిన ప్రభుత్వం.. ఇప్పటివరకూ చెల్లించడంలేదని అంటున్నారు.
6 వేల పరిశ్రమలు..
జిల్లాలో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు 6 వేలకు పైగా ఉన్నాయి. 2020 మార్చి నుంచి జూన్ వరకు లాక్‌డౌన్ నిబంధనల కారణంగా మూతపడటంతో చాలా పరిశ్రమలు ఆర్థికంగా నష్టపోయాయి. అయినా వారంతా విద్యుత్ ఛార్జీలు చెల్లించాల్సి రావడం ప్రభావం చూపింది. తీసుకున్న కేవీ లోడును బట్టి కనీస, స్థిర ఛార్జీలు కలిపి రూ.40 వేల నుంచి రూ.2 లక్షల వరకు చెల్లించిన పరిశ్రమలు ఉన్నాయి. ఉదాహరణకు గత ఏడాది మూతపడిన కాలంలో ఒక చిన్నతరహా గ్రానైట్ పరిశ్రమ నెలకు 4,468 యూనిట్లను వాడినా, వాడకపోయినా కనీస ఛార్జీలు రూ.30 వేలు, స్థిర ఛార్జీల కింద మరో రూ.45 వేలు చెల్లించినట్లు ఓ నిర్వాహకుడు తెలిపారు.
తీవ్రమైన కష్టకాలంలో..
లాక్‌డౌన్ కారణంగా అనేక విధాలుగా నష్టపోయాయని, పరిశ్రమలు మూతపడిన మూడునెలల కాలానికి సంబంధించిన కనీస విద్యుత్తు ఛార్జీలను మినహాయించాలని యజమానులు కోరడంతో ప్రభుత్వం అప్పట్లో హామీ ఇచ్చింది. వారి నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ చేపట్టింది. దరఖాస్తులు పరిశీలించే సమయంలో అద్దె భవనాల్లో నిర్వహిస్తున్న పరిశ్రమలకు రాయితీలు ఇవ్వడం కుదరదన్న నిబంధనతో మరోసారి యజమానులు తమ ఇక్కట్లను తెలియజేశారు.
అద్దె ఒప్పందం చేసుకున్నట్లు ఉంటే చెల్లించేందుకు అవకాశం ఉంటుందని వివరించడంతో మరికొందరు దరఖాస్తు చేశారు. ఈ ప్రక్రియ ముగిసి ఇప్పటికి ఏడాది సమీపిస్తున్నా ఇంతవరకు కనీస ఛార్జీలు వెనక్కి రాలేదు. ఇప్పుడు కరోనా రెండో దశలో కూడా వ్యాపారం సరిగా లేక అవస్థలు పడుతున్నామని, ఇప్పటికైనా ఆ బకాయిలు చెల్లించాలని కోరుతున్నారు.
ప్రతిపాదనలు పంపించాం..
జిల్లాలోని చిన్నతరహా పరిశ్రమలకు 2020లో మూడు నెలల కనీస విద్యుత్తు ఛార్జీలను ఇప్పించాలంటూ యజమానులు దరఖాస్తు చేసుకున్నారు. వాటిని పరిశీలించి 1,100 పరిశ్రమలను ప్రతిపాదించాం. రూ.9.92 కోట్లు రావాల్సి ఉంది. ఈ నిధులను ప్రభుత్వం ఇంకా విడుదల చేయలేదు.-చంద్రశేఖర్, జీఎం, పరిశ్రమలశాఖ
ఇదీ చదవండి: