జలకళ సంతరించుకున్న నాగార్జున సాగర్ ప్రాజెక్టు.. చెరువుల్లో నీరు నింపుతోంది. ప్రాజెక్టు నుంచి కాలువల్లోకి వస్తున్న నీరు.. ప్రకాశం జిల్లా పరుచూరు నియోజకవర్గ రైతులకు సంతోషం పంచుతోంది. అయితే.. ఇంకొల్లు పరిధిలోని రైతులు మాత్రం.. కాలువల నీటిని తమ ప్రాంతంలోని చెరువుల్లోకి పంపించేందుకు లక్షలు ఖర్చు చేస్తున్నారు. నాగుల చెరుపు, పెద్ద చెరువుల్లోకి కాలువల నీరు తరలించే సదుపాయం లేకపోవడం.. వారిని ఇబ్బంది పెడుతోంది.
ఈ చెరువులు నింపేందుకు.. 20 ట్రాక్టర్లు పెట్టారు. పర్చూరు మార్కెట్ యార్డు నుంచి కిలోమీటరు మేర తాత్కాలిక కాలువ తవ్వి నీటిని చెరువుల్లోకి పంపిస్తున్నారు. ఏటా 3 సార్లు నిర్వహించే ఈ ప్రక్రియకు.. 5 లక్షల చొప్పున మొత్తం 15 లక్షల రూపాయలు ఖర్చు అవుతోందని పంచాయతీ అధికారులు కూడా చెబుతున్నారు. ఇప్పటికైనా.. ప్రభుత్వం స్పందించి.. కాలువ నుంచి చెరువులకు పైపులైను వేయిస్తే.. శాశ్వతంగా సమస్య పరిష్కారం అవుతుందన్నారు.