విశాఖ మాజీ ఎంపీ డాక్టర్ కంభంపాటి హరిబాబును మిజోరం రాష్ట్ర గవర్నర్‌గా నియమిస్తూ రాష్ట్రపతి మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు. ఆయన స్వస్థలం ప్రకాశం జిల్లా తిమ్మసముద్రం. వెంకటేశ్వర్లు, సీతమ్మ దంపతుల కుమారుడైన హరిబాబు ఎం.ఇ., పీహెచ్‌డీ చేశారు. ఇంజినీరింగ్ కోసం విశాఖ వచ్చిన ఆయన.. తర్వాత ఇక్కడే స్థిరపడ్డారు. ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడికి సన్నిహితుడిగా హరిబాబుకు గుర్తింపు ఉంది. 2014లో విశాఖ ఎంపీగా వై.ఎస్.విజయమ్మపై గెలుపొందారు. విశాఖ నుంచి గవర్నర్ గిరీ దక్కించుకున్న మొట్టమొదటి వ్యక్తి ఈయనే. హరిబాబు భార్య జయశ్రీ గృహిణి. వీరికి చేతన, చందన అనే ఇద్దరు కుమార్తెలున్నారు.
విద్యార్థిగా చేరి... ఆచార్యుడిగా ఎదిగి...
ఆంధ్ర విశ్వవిద్యాలయంలో చదువుకోవడానికి విశాఖ వచ్చిన హరిబాబు.. విద్యార్థి నాయకుడిగా కీలకపాత్ర పోషించారు. చదువు పూర్తయ్యాక అక్కడే 24 ఏళ్లు ఆచార్యుడిగా పనిచేశారు. జైఆంధ్ర ఉద్యమంలో తెన్నేటి విశ్వనాథం, సర్దార్ గౌతు లచ్చన్న, ఎం.వెంకయ్యనాయుడులతో కలిసి ఉద్యమాలు చేశారు. ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా 1974-75 మధ్య పోరాటంలో హరిబాబును నాటి ప్రభుత్వం అరెస్టుచేసి ఆరు నెలలు జైలుకు పంపింది.
మిజోరం ప్రగతికి కృషిచేస్తా
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వారధిగా ఉంటూ తన పరిమితులకు లోబడి మిజోరం రాష్ట్ర అభివృద్ధికి కృషిచేస్తానని డాక్టర్ కె.హరిబాబు పేర్కొన్నారు ఆయనేమన్నారంటే...
‘ఈశాన్య రాష్ట్రమైన మిజోరం అభివృద్ధికి అనేక అవకాశాలు, సవాళ్లూ ఉన్నాయి. నా అనుభవంతో ఆ రాష్ట్ర ప్రజల అభివృద్ధికి, సంక్షేమానికి శక్తివంచన లేకుండా కృషిచేస్తాను. అప్పగించిన పనిని వివాదాలకు తావులేకుండా అంకితభావంతో, చిత్తశుద్ధితో, క్రమశిక్షణతో పూర్తిచేయడం వల్లే ఈ పదవి వచ్చిందని భావిస్తున్నాను. గవర్నర్‌గా అందరినీ సమన్వయపరచుకుంటూ, నా బాధ్యతను సమర్థంగా నిర్వర్తిస్తాను. అక్కడి ప్రజలు, సంస్కృతితో మమేకమై వారి మనోభావాలను గౌరవిస్తూ ఆ రాష్ట్ర ప్రగతికి కృషిచేస్తా. రాజ్యాంగబద్ధ బాధ్యతలు స్వీకరించబోతున్న నేపథ్యంలో భాజపాకు రాజీనామా చేస్తాను. వారం రోజుల్లోగా బాధ్యతలు స్వీకరించాలని భావిస్తున్నా. విశాఖతో నా అనుబంధం విడదీయలేనిది. నగర అభివృద్ధికి నా వంతు కృషిచేస్తా. నాపై నమ్మకం ఉంచి నన్ను గవర్నర్ పదవికి ఎంపికచేసిన రాష్ట్రపతికి, ఉపరాష్ట్రపతికి, ప్రధానికి, కేంద్ర హోంమంత్రికి ప్రత్యేక కృతజ్ఞతలు.’
-విశాఖ మాజీ ఎంపీ డాక్టర్ కంభంపాటి హరిబాబు
- గవర్నర్‌గా నియమితులైన హరిబాబుకు పలువురు అభినందనలు తెలియజేశారు. విశాఖలో ఉన్న ఆయనకు పలువురు నేతలు, సన్నిహితులు, ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు.
స్వస్థలంలో హర్షాతిరేకాలు
మిజోరం గవర్నర్‌గా హరిబాబు నియమితులవ్వడంతో ఆయన స్వగ్రామం ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం తిమ్మసముద్రంలో సందడి నెలకొంది. సామాన్య రైతు కుటుంబంలో పుట్టిన ఆయన.. అంచలంచెలుగా ఎదిగి గవర్నర్ పదవికి ఎంపికయ్యారు. ఎస్‌ఎస్‌ఎల్‌సీ వరకూ స్థానిక గోరంట్ల వెంకన్న కమిటీ ఉన్నత పాఠశాలలో, పీయూసీ విజయవాడ లయోలా కళాశాలలో చదివారు.
ప్రస్థానం ఇలా..
1977: జనతాపార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు
1978: జనతా యువమోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు
1988: ఏయూ టీచర్స్ అసోసియేషన్ కార్యదర్శి
1991-2003: భాజపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
1999: విశాఖ-1 నుంచి శాసనసభ్యుడిగా ఎన్నిక
2003: భాజపా శాసనసభాపక్ష నాయకుడు
2005: భాజపా జాతీయ కార్యదర్శిగా నియామకం
2013: భాజపా జాతీయ క్రమశిక్షణ కమిటీ సభ్యుడు
2014: విశాఖ నుంచి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నిక
పలు పార్లమెంటరీ కమిటీలలో ఆయన పనితీరుకు ప్రశంసలు అందాయి.
ఇదీ చూడండి: మోదీ కేబినెట్లో కొత్త మంత్రిత్వ శాఖ!