ప్రకాశం జిల్లా పొదిలిలో దొంగనోట్లను కొనుగోలు చేసేందుకు.. జులై ఏడో తేదీన బెంగుళూరుకు చెందిన సత్తార్ రహంతుల్లా ఖాన్ పట్టణానికి వచ్చారు. శివాలయం వద్ద ముగ్గురు వ్యక్తులకు రూ.ఏడు లక్షలు అసలు నగదు ఇచ్చి, రూ.70 లక్షలు విలువైన దొంగ నోట్లు తీసుకున్నాడు. కొద్దిసేపటి తరువాత తాను తీసుకున్న దొంగనోట్ల డబ్బాను తెరిచాడు. అందులో పైన మాత్రమే నకిలీనోట్లు, లోపల దినపత్రికలు ఉన్నాయి. దీంతో మోసపోయినట్లు గుర్తించిన సత్తార్... పొదిలి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు.
పైన నకిలీ నోట్లు.. లోపల దినపత్రికలు..
బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. జులై 16న ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసి రూ.నాలుగు లక్షలు నగదును స్వాధీనం చేసుకున్నారు. దర్యాప్తులో భాగంగా ఇవాళ దర్శి మండలంలోని తూర్పువీరాయపాలెంలో ఉన్న పాముల ఆదినారాయణ, మధుమంచి ఆంజనేయులు, ప్రసాద్ లను అరెస్ట్ చేసినట్లు ఎస్పీ మలికా గార్గ్ తెలిపారు. వీరి వద్ద నుంచి రూ.2.90 లక్షల నగదు, చిన్నారులు ఆడుకునే నకిలీ నోట్ల కట్టలు, ఒక స్కూటీని స్వాధీనం చేసుకున్నారు.
ఆశ్రమంలో ఏర్పడిన పరిచయంతో...
ఈ కేసులో ఏ1 గా ఉన్న పాముల ఆదినారాయణ.. కర్ణాటకలోని బాగేపల్లిలో నివసిస్తుండగా... ఏ2 గా ఉన్న ఆంజనేయులు పశ్చిమగోదావరి జిల్లాలోని ద్వారకా తిరుమలవాసి. వీరికి బాగేపల్లి లీలావతి ఆశ్రమంలో ఏర్పడిన పరిచయంతో పశ్చిమగోదావరి, గుంటూరు, ఒంగోలు, కడప, హైదరాబాద్ తదితర ప్రాంతాల్లో నకిలీ బంగారు బిస్కెట్లు, నకిలీ కరెన్సీ నోట్ల మోసాలకు పాల్పడినట్లు ఎస్పీ మలికా వెల్లడించారు. తక్కువ ధరలకు బంగారం ఇస్తామంటే ప్రజలు నమ్మి, మోసపోవద్దని ఎస్పీ సూచించారు.
ఇదీచదవండి.