ప్రకాశం జిల్లా చీరాల నియోజకవర్గంలో అధికార పార్టీ వర్గపోరు మరోసారి బహిర్గతమైంది. ప్రస్తుతం నియోజకవర్గంలో రెండు మండలాలుండగా.. కేవలం వేటపాలెం మండలం రామన్నపేట పంచాయతీలో మాత్రమే ఎన్నికలు జరుగనున్నాయి. నామినేషన్ల చివరి రోజు అధికారపార్టీ మద్దతుదారులతో ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తి బలపరచిన అభ్యర్థి ఆదిలక్ష్మితో పాటు 14 వార్డులకు నామినేషన్లు దాఖలు చేయించారు.
మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ మద్దతుదారైన మద్దాలి చెంచులక్ష్మీ సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ వేశారు. 14 వార్డుల్లో పోటీకి నిలిచిన సభ్యులు నామినేషన్లు వేయడం గమనార్హం. తెదేపా తరఫున చీరాల నుంచి ఎంపికైన కరణం బలరామకృష్ణమూర్తి అధికార పార్టీకి మద్దతు తెలపడమే కాక.. తనయుడు వెంకటేష్‌ను పార్టీలోకి చేర్చారు. అప్పటి నుంచి చీరాల కరణం వర్గీయులు పోటా పోటీగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
తెదేపా మద్దతుతో.. నియోజకవర్గ పార్టీ బాధ్యుడు ఎడం బాలాజీ అనుచరుడు సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. 14 వార్డులకు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. సుమారు 4740 ఓట్లు ఉన్న రామన్నపేట పంచాయతీలో త్రిముఖ పోటీ నెలకొననుంది. నామపత్రాలను స్వీకరించేందుకు చివరి రోజు కావడంతో అభ్యర్ధులతో కిక్కిరిసి పోయింది. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు.
ఇదీ చదవండి: