ప్రకాశం జిల్లాలోని ఒంగోలు - కర్నూలు రహదారి మార్గంలో మైనింగ్ జోన్ ఏర్పాటుకు రూ.150 కోట్లతో అంచనాలు పూర్తయ్యాయి. ప్రభుత్వ ఆదేశాల కోసం అధికారులు వేచిచూస్తుండగా, స్థానికుల్లో మాత్రం నిరసన వ్యక్తమవుతోంది. చీమకుర్తి బైపాస్ కూడలి 24వ కిలోమీటరు నుంచి మర్రిచెట్లపాలెం 29వ కిలోమీటరు వరకు జోన్ ఏర్పాటుపై ప్రతిపాదనలు ఉన్నాయి. అయిదేళ్ల కిత్రం గనుల శాఖ అధికారులు ఈ ప్రాంతంలో రూ.3 వేల కోట్ల విలువైన గ్రానైట్ నిక్షేపాలు ఉన్నాయని ఇచ్చిన నివేదిక ప్రకారం అప్పటి ప్రభుత్వం జోన్ ఏర్పాటుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది. క్వారీల యజమానులు, కొందరు నేతలు, స్థానికులు వ్యతిరేకించడంతో ముందడుగు పడలేదు.
ప్రాభవం కోల్పోతుందంటూ ఆవేదన
ఒంగోలు - కర్నూలు రహదారిలో మైనింగ్ జోన్ ఏర్పాటైతే ప్రత్యామ్నాయ రహదారి నిర్మాణ అంశం గతంలో చర్చకు వచ్చింది. చీమకుర్తి బైపాస్ తూర్పు వైపు కూడలి నుంచి సాగర్ కాలువ పక్కన కేవీపాలెం, పులికొండ, మైలవరం, బూదవాడల మీదుగా మర్రిచెట్లపాలెం కూడలి వరకు దాదాపు 15 కిలోమీటర్లు రోడ్డు నిర్మించాలనే ప్రతిపాదన నడిచింది. అదే జరిగితే చీమకుర్తి ప్రాభవం కోల్పోతుందని.. బస్సులు తమ ప్రాంతానికి రావని.. దూరం పెరిగి రవాణా ఛార్జీల భారమూ పడుతుందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బఫర్ జోన్‌తో రామతీర్థం పుణ్యక్షేత్రం సైతం ప్రాభవం కోల్పోతుందని మరికొందరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అందుబాటులో ఉన్న భూమిలోనే మైనింగ్ కరవు
గెలాక్సీ గ్రానైట్ నిక్షేపాలు ఉన్నాయన్న కారణంతో చీమకుర్తి వద్ద ఉన్న పశు క్షేత్రాన్ని 2001లో చదలవాడకు మార్చారు. అక్కడున్న 310 ఎకరాల భూమి ఏపీఎండీసీ పరిధిలో ఉండగా ఇరవయ్యేళ్లుగా కేవలం 100 ఎకరాల్లో మాత్రమే మైనింగ్ చేపట్టారు. మిగిలిన 210 ఎకరాల్లో ఇప్పటివరకు లేదు. ఉన్న భూమిలోనే జరగకపోగా గ్రానైట్ నిక్షేపాలు ఉన్నాయని జోన్ ఏర్పాటుకు ప్రయత్నాలు మొదలుపెట్టడంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వం నుంచి వచ్చిన ఆదేశాల మేరకు గతేడాది ప్రయత్నాలు మొదలవగా ఉన్నతాధికారులు భూములను పరిశీలించారు.
ఇదీ చదవండి: