Dhulipala comments in mahanadu: వైకాపా పాలనలో రాష్ట్ర రైతాంగం తీవ్ర సంక్షోభంలోకి వెళ్లిపోయిందని తెదేపా సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్ర అన్నారు. 45 లక్షల ఎకరాల్లో పంటల సాగు ఉంటే కేవలం 15 లక్షల ఎకరాలకే ఇన్సూరెన్స్ ఇచ్చారని మండిపడ్డారు. 'కష్టాల కడలిలో సేద్యం.. దగాపడుతున్న రైతన్న' అనే అంశంపై మహానాడులో ధూళిపాళ్ల తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. పెట్రో ధరల భారం కారణంగా రైతులపైనా తీవ్ర భారం పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. మోటార్లకు మీటర్లు పెడితే రైతులకు లాభమని మంత్రులు వింత వాదన చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ రైతులకు మీటర్లు పెట్టబోమని స్పష్టంగా చెపితే.. జగన్ మీటర్లు పెట్టి ఉరితాళ్లు వేస్తున్నాడని ధ్వజమెత్తారు.
తెదేపా హయాంలో రైతులకు ఉన్న పథకాలు అన్నీ ఆగిపోయాయని ఆరోపించారు. రాయలసీమలో ఉండే డ్రిప్ ఇరిగేషన్ పూర్తిగా ఆపేశారని ధ్వజమెత్తారు. ఒక్క రూపాయి కూడా రైతులకు డ్రిప్ సబ్సిడీ కింద ఇవ్వలేదని దుయ్యబట్టారు. ప్రభుత్వం చెప్పిన రూ.3 వేల కోట్ల ధరల స్థిరీకరణ నిధి ఏమైందని ప్రశ్నించారు. ధరల స్థిరీకరణ నిధి పెట్టి ఉంటే రూ.1000- 1100కు ధాన్యం ఎందుకు అమ్ముకుంటారని నిలదీశారు. స్వయంగా వైకాపా ఎంపీనే ధాన్యం విషయంలో రైతులకు జరుగుతున్న అన్యాయంపై చెప్పింది వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. రైతుకు తెదేపా ప్రభుత్వం ఖర్చు చేసిన దానికంటే ఒక్క రూపాయి కూడా అదనంగా వైకాపా ఖర్చు చేయలేదన్నారు.
మధ్యాహ్నం వరకు నేతలు మహానాడులో నాలుగు తీర్మానాలను ప్రవేశపెట్టారు. కార్యకర్తలపై ప్రభుత్వ వేధింపులు, బాదుడే బాదుడు, సంక్షేమ పథకాల్లో మోసం, కష్టాల కడలిలో సేద్యం అంశాలపై తీర్మానాలకు మహానాడు ఆమోదం తెలిపింది.
ఇవీ చదవండి: