వ్యయప్రయాసలకోర్చి పండించిన పంటను.. రవాణా పూర్తిగా నిలిచిపోయినందున కొనే వారే కరవయ్యారు. ఆర్థిక ఇబ్బందులు వెన్నాడుతున్నా అమ్ముకోలేని దుస్థితి. పంట నిల్వ చేద్దామన్నా శీతల గిడ్డంగులు అందుబాటులో లేని పరిస్థితి. ప్రకాశం జిల్లాలో శనగ, మిర్చి సాగు ఎక్కువ. వీటిని శీతల గిడ్డంగుల్లోనే నిల్వ చేయాల్సిన పరిస్థితి. ప్రస్తుతం అవి ఖాళీ లేకపోవడం సమస్యగా మారింది. జిల్లాలో మొత్తం 74 వరకు శీతల గిడ్డంగులున్నాయి. పర్చూరు ప్రాంతంలో 26 ఉన్నాయి. వీటి పూర్తి సామర్థ్యం 5.54 లక్షల మెట్రిక్ టన్నులు. సరైన ధర లేని కారణంగా 75 శాతానికి పైగా శనగ నిల్వలు మూడేళ్లుగా అలాగే ఉన్నాయి. పాత నిల్వలు దాదాపు 3 లక్షల మెట్రిక్ టన్నుల వరకు ఉన్నందున... కొత్తగా మరో 2 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే నిల్వ చేసుకునే అవకాశం ఉంది.
జిల్లాలో 85 వేల హెక్టార్లలో శనగ సాగు చేశారు. ఎకరానికి 6 క్వింటాళ్ల సగటు ఉత్పత్తి తీసుకున్నా... 12.75 లక్షల క్వింటాళ్ల దిగుబడి ఉంది. మిర్చి 27,516 హెక్టార్లలో సాగు చేశారు. ఈ దిగుబడి సుమారు 17.20 లక్షల క్వింటాళ్లు వచ్చే అవకాశం ఉంది.
రెండు పంటలు కలిసి 3 లక్షల మెట్రిక్ టన్నులు ఉండొచ్చని అంచనా. ఇవి కాకుండా మినుము, కంది ఇతర పంటలూ నిల్వ చేస్తారు. ఈ నేపథ్యంలో జిల్లాలో ఉత్పత్తయిన పంటలు స్థానికంగా నిల్వ చేసుకోవడం పూర్తిస్థాయిలో సాధ్యం కాదు. ఇలాంటి పరిస్థితుల్లో పంటల కొనుగోలుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటే... నిల్వ కష్టాల నుంచి రైతులకు కొంతమేర ఉపశమనం కలుగుతుంది. ప్రభుత్వం, అధికారులు ఆ దిశగా చర్యలు తీసుకోవాలని అన్నదాతలు విజ్ఞప్తి చేస్తున్నారు.
కుదేలైన గ్రానైట్ పరిశ్రమ
కరోనా.. పంటలపైనే కాదు గ్రానైట్ పరిశ్రమపైనా గణనీయ ప్రభావం చూపుతోంది. లాక్‌డౌన్‌తో పరిశ్రమల్లో గత 12 రోజులుగా పనులు పూర్తిస్థాయిలో స్తంభించాయి. రోజుకు సరాసరిన రూ. 8 కోట్ల విలువైన ముడిరాయి వ్యాపార లావాదేవీలు నిలిచిపోవటంతో ఆ ప్రభావం ఆయా రంగాలపై కనిపిస్తోంది. ఆయా సంస్థల్లో పనిచేస్తున్న కార్మికులు, సిబ్బంది గదులకే పరిమితం అవుతున్నారు. రాష్ట్రాల మధ్య సరిహద్దులు మూసివేసినందున తమిళనాడు, ఒడిశా, రాజస్థాన్ తదితర రాష్ట్రాలకు చెందిన కార్మికులు తమ సొంత ప్రాంతాలకు వెళ్లలేక ఇక్కడే ఇబ్బందులు పడుతున్నారు. 200కి పైగా లారీలు.. స్టాండ్లు, పెట్రోలు బంకులకే పరిమితమయ్యాయి. దీంతో డ్రైవర్లు, క్లీనర్లు ఇబ్బంది పడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో క్వారీల్లో పనిచేసే జాకీ, కాంట్రాక్టు కార్మికులు, మహిళా కూలీలకు వేతనాలు చెల్లించాలని గ్రానైట్ కార్మికుల సంఘం గౌరవాధ్యక్షుడు కాలం సుబ్బారావు కోరుతున్నారు.
ఇటుక.. వెతలు ఎవరికెరుక..
కరోనా వైరస్ ప్రభావం ఇటుక బట్టీల యజమానులు, కార్మికుల పైనా పడింది. లక్షల కొద్దీ తయారు చేయించిన ఇటుకలు బట్టీల్లోనే ఉండిపోయాయి. రాష్ట్ర ప్రభుత్వం గృహ నిర్మాణాలు చేపడతారనే ప్రచారంతో అద్దంకి ప్రాంతంలో బట్టీల యజమానులు ఇటుకలను భారీగా తయారు చేశారు. లాక్‌డౌన్‌తో రవాణా నిలిచిపోయి ఒక్క ఇటుక కూడా బట్టీ దాటడం లేదు.
● అద్దంకి, తిమ్మాయపాలెం పరిసరాల్లో సుమారు 70 వరకు ఇటుక బట్టీలున్నాయి.
● ఒక్కో బట్టీలో 10 లక్షలకు పైగా ఇటుకలు తయారు చేసి ఉంచారు. వీటి తయారీకి యానాం, తూర్పుగోదావరి జిల్లాల నుంచి కూలీలను రప్పిస్తారు. కుటుంబాలతో సహా వారు ఈ ప్రాంతంలో పని చేసి ప్రతి వారం బట్వాడా తీసుకుంటారు. కరోనా వైరస్ ప్రభావంతో ఇటుక బట్టీల్లో కూలి పనులు నిలిచిపోయాయి.
● ఒక్కో బట్టీ వద్ద కనిష్ఠంగా 15 మంది వరకు కూలీలు పని చేస్తుంటారు. ఈ విషయమై ఇటుక బట్టీల యజమానుల సంఘం తరఫున దొప్పలపూడి దుర్గాప్రసాద్ మాట్లాడుతూ.. కార్మికులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తామన్నారు.
ఇవీ చదవండి: