ప్రకాశం జిల్లాలో ఇప్పటి వరకు 41 మందికి కరోనా సోకగా... వారంతా కోలుకుంటున్నారు. ఒంగోలు నగరంలోని గోపాల్‌నగర్‌కు చెందిన వ్యక్తికి వ్యాధి నిర్ధరణ కాగా.. నెల్లూరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇంకోవైపు యంత్రాంగం అన్ని కంటైన్‌మెంట్ జోన్లనూ జల్లెడ పట్టింది. వైరస్ సోకిన వారి కుటుంబ సభ్యుల నమూనాల పరీక్షలు పూర్తయ్యాయి. వారిలో ఎక్కువ మందికి నెగెటివ్ వచ్చినప్పటికీ, క్వారంటైన్‌లో 14 రోజులు ఉంచాలని నిర్ణయించారు. దిల్లీ వెళ్లొచ్చిన వారిలో వ్యాధి సోకి కోలుకున్న అయిదుగురిని త్వరలో డిశ్చార్జి చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. వారి నమూనాలను మరోసారి పరీక్షకు పంపి.. వరసగా 3 సార్లు నెగెటివ్ వస్తే డిశ్చార్జి చేస్తారు.
ఈ నెలాఖరులోపు....
ఈ నెలాఖరులోపు కంటైన్మెంట్ జోన్లలోని ప్రజలకు పెద్ద సంఖ్యలో పరీక్షలు చేయడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. జీజీహెచ్‌లో వీఆర్‌డీఎల్ ల్యాబ్ వచ్చే సోమవారం నాటికి అందుబాటులోకి వస్తుంది. జిల్లాలో ఒంగోలు, చీరాల, కందుకూరు, మార్కాపురం, కనిగిరి పట్టణాలను, కొనకనమిట్ల, కారంచేడును కంటైన్మెంట్ జోన్లుగా గుర్తించారు. పట్టణాల్లో పాజిటివ్ కేసులు వచ్చిన చోట.. చుట్టూ మూడు కిలోమీటర్ల పరిధిలో, గ్రామీణ ప్రాంతాల్లో అయిదు కిలోమీటర్ల పరిధిలో ర్యాండమ్‌గా సుమారు 15 వేల మంది నమూనాలు సేకరించి పరీక్ష చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. క్వారంటైన్ల నుంచి డిశ్చార్జి అయి ఇళ్లకు వెళ్లిన వారు మరో 14 రోజులు హోమ్ ఐసోలేషన్‌లో ఉండాలని సూచిస్తున్నారు. ఇకపైనా వారి సమాచారాన్ని రోజూ సేకరిస్తారు.
రెడ్‌జోన్‌గా ప్రకటన...
గుడ్లూరు ప్రధాన వీధిని రెడ్‌జోన్‌గా ప్రకటించినట్లు ఎస్సై పాండురంగారావు తెలిపారు. ఈ ప్రాంతానికి చెందిన ఓ మహిళ ఇటీవల అనారోగ్యంతో హైదరాబాద్‌లో మృతి చెందారు. ఆలస్యంగా వచ్చిన వైద్య పరీక్షల ఫలితాల్లో ఆమెకు కరోనా లక్షణాలున్నట్లు తేలటంతో.. ఆమె ఇంటికి 300 మీటర్ల చుట్టూ రెడ్‌జోన్‌గా ప్రకటించి బారికేడ్లు ఏర్పాటు చేశామన్నారు.
ఇవీ చదవండి: