కరోనా లాక్‌డౌన్ ప్రభావం పూల రైతులను కోలుకోలేని దెబ్బ తీసింది. మార్చి 22 నుంచి పూల విక్రయాలు పూర్తి స్థాయిలో ఆగిపోగా.. గుంటూరు జిల్లా కొండవీడు పరిసర గ్రామాల్లో పూల సాగు చేస్తున్న రైతులు తీవ్రంగా నష్టపోయారు. నిత్యావసరాలు, కూరగాయల విక్రయాలను అనుమతిస్తున్న పోలీసులు.. పూల అమ్మకాలను మాత్రం నిలువరించారు. ఉగాది, శ్రీరామ నవమి, గుడ్ ఫ్రైడే వంటి పండుగ సమయాల్లోనూ పూల అమ్మకాలు జరగలేదు. ఈ కారణంగా గుంటూరు జిల్లాలో పూల తోటలు పూర్తి స్థాయిలో పాడైపోయాయి. కొన్ని చోట్ల రైతులు తోటలను పశువులకు వదిలేశారు. లాక్ డౌన్ మరో 3 వారాలు పొడిగించిన కారణంగా.. తీవ్ర నిరాశకు గురయ్యారు. పూలను అమ్ముకునే అవకాశాలు ఏమాత్రం కనిపించని పరిస్థితుల్లో గొర్రెలకు మేతగా వదులుతున్నట్లు రైతులు చెబుతున్నారు. ఎకరాకు కనీసం 50 వేల రూపాయల వరకు నష్టపోయినట్లు ఆవేదన చెందుతున్నారు.
ఇదీ చదవండి: గ్రామంలోకి కరోనా అనుమానితులను తరలించొద్దని ధర్నా