AP PCC president Gidugu Rudraraj comments: ఆంధ్రప్రదేశ్‌లో రాబోయే అసెంబ్లీ (2024) ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఒంటరిగానే పోటీ చేస్తుందని పీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు తెలిపారు. ఒంగోలు జిల్లాలో పార్టీ బలోపేతం కార్యక్రమంలో భాగంగా ఆయన నాయకులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం 2024 అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీతోనూ పొత్తు ఉండదని స్పష్టం చేశారు. అన్నీ అసెంబ్లి, పార్లమెంట్ స్థానాల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని తేల్చి చెప్పారు.
ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికొస్తే.. మూడున్నరేళ్లుగా రాష్ట్ర ప్రజలు జగన్ మోహన్ రెడ్డి నియంతృత్వ పాలనలో విసిగి పోతున్నారన్నారు. రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని జిల్లాల వారీగా సన్నద్ధం అవుతున్నామని పేర్కొన్నారు. జనవరి 26న రాహుల్ గాంధీ చేపట్టిన 'భారత్ జోడో యాత్ర' ముగుస్తుందని.. ఆరోజు నుంచి మార్చి 26 వరకు రెండు నెలల పాటు అన్ని జిల్లాల్లో "చేయి చేయి కలుపుదాం - రాహూల్ గాంధీ నాయకత్వాన్ని బలపర్చుదాం" అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు. దేశంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే.. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాపై రాహుల్ గాంధీ తొలి సంతకం చేస్తారని గిడుగు రుద్రరాజు వివరించారు.
అనంతరం రాష్ట్రంలోనూ కాంగ్రెస్ తిరిగి అధికారంలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ, ముస్లిం మైనారిటీలకు, ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులకు చట్టంతో పాటు అనేక సంక్షేమ కార్యక్రమాలను తీసుకొచ్చిన కాంగ్రెస్‌ను ప్రజలు తప్పనిసరిగా ఆదరిస్తారన్నారు. కార్యక్రమంలో కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్, ఏఐసీసీ ఇంచార్జి మెయ్యప్పన్, నెల్లూరు, ప్రకాశం జిల్లా అధ్యక్షులు ఇతర నాయకులు పాల్గొన్నారు.
కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం పార్టీ శ్రేణులందరికీ ఒక పిలుపునిచ్చింది. అదేమిటంటే.. జనవరి 26 నుంచి మార్చి 26 వరకు అంటే రెండు నెలలపాటు రాష్ట్రంలో ఉన్న ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఆయా గ్రామాల్లో గానీ, వార్డుల్లో గానీ, బూతుల్లో గానీ ఉండాలని పిలుపునిచ్చింది. రెండు నెలలపాటు "చేయి చేయి కలుపుదాం - రాహూల్ గాంధీ నాయకత్వాన్ని బలపర్చుదాం", చేయి చేయి కలుపుదాం -కాంగ్రెస్ పార్టీని బలపర్చుదాం" అనే నినాదంతో ప్రజాక్షేత్ర చేపట్టనున్నాం.- గిడుగు రుద్రరాజు, పీసీసీ అధ్యక్షుడు
ఇవీ చదవండి