Conflicts erupted in Minister Suresh's constituency: మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం నియోజకవర్గంలో వైకాపా నాయకుల మధ్య వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమ ప్రారంభానికి ముందురోజైన మంగళవారం జిల్లాలోని పుల్లలచెరువు మండలంలోని ఓ వర్గం నాయకులు మంత్రి తీరుకు నిరసనగా సమావేశం ఏర్పాటుచేసి బహిరంగ విమర్శలు గుప్పించారు.
ఆ మరుసటి రోజే వై.పాలెం మండలంలోని మురారిపల్లెలో రెండు వర్గాల మధ్య విభేదాలు బయటపడ్డాయి. మంత్రి సురేష్ ‘గడప గడపకు మన ప్రభుత్వం’లో భాగంగా బుధవారం ప్రారంభించాల్సిన పాఠశాల శిలాఫలకాన్ని ఓ వర్గం వారు ధ్వంసం చేశారు. దీంతో ఆగ్రహించిన ప్రత్యర్థి వర్గం అక్కడున్న ఫ్లెక్సీని చించేసింది.
స్థలదాత పేరు లేకపోవడంతో.. గత సర్పంచి ఎన్నికల్లో వైకాపాకు చెందిన రెండు వర్గాలవారు పోటీ చేశారు. గెలిచిన వర్గం వారికి పనులు చేస్తూ.. తమను పట్టించుకోవడంలేదనే అసంతృప్తి ఓడిన వారిలో నెలకొంది. గ్రామంలోని యూపీ పాఠశాలను ప్రభుత్వం నాడు-నేడులో భాగంగా అభివృద్ధి చేసింది. ఈ పనులను గెలిచిన వర్గం చేపట్టింది. ‘గడప గడపకు మన ప్రభుత్వం’లో భాగంగా మంత్రి సురేష్ దీన్ని ప్రారంభించేలా ఏర్పాట్లు చేసి శిలాఫలకం వేశారు.
ప్రత్యర్థి వర్గానికి చెందిన మాజీ సర్పంచి ఈ పాఠశాల నిర్మాణానికి గతంలో స్థలాన్ని విరాళంగా ఇచ్చారు. స్థలదాత పేరు శిలాఫలకంపై వేయకపోవడంతో ఆగ్రహించిన ఆయన అనుచరులు బుధవారం ఫలకాన్ని ధ్వంసం చేశారు. పోలీసుల రంగ ప్రవేశంతో గొడవ సద్దుమణిగాక.. మంత్రి సురేష్ బుధవారం సాయంత్రం గ్రామానికి వెళ్లి యథావిధిగా కార్యక్రమం చేపట్టారు.
ఇదీ చదవండి: