ప్రకాశం జిల్లా యద్దనపూడి శ్రీశక్తి భవన్ ఎదుట డ్వాక్రా సంఘాల మహిళలు ఆందోళనకు దిగారు. పొదుపు సంఘాల ద్వారా రుణాలు పొంది వ్యాపారం చేసుకుంటోన్న మహిళల అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకుని కొందరు అధికారులు 20 లక్షల రూపాయలు చెల్లించాలంటూ నోటీసులు పంపించారు. ఊహించని ఈ పరిణామంతో మహిళలు ఆందోళనకు గురయ్యారు. ఈ విషయంపై అధికారులను సంప్రదించగా వారి నుంచి సరైన సమాధానం రానందున నిరసన చేపట్టారు. బాధ్యులను గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని నినాదాలు చేశారు.
గ్రామంలోని 65 గ్రూపులకు చెందిన 650 మంది మహిళలపై అదనపు భారం మోపారని మహిళలు వాపోయారు. రుణాల చెల్లింపుల్లో అవకతవకలకు పాల్పడిన అధికారులు, ఉద్యోగులు, యానిమేటర్లపై చర్యలు తీసుకొని, వారిని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. యద్ధనపూడి ఏపీఓ మధుసూధన్రావుకు వినతి పత్రం అందజేశారు. దీనిపై స్పందించిన ఆయన పూర్తి వివరాలు సేకరించి జరిగిన విషయాన్ని ఉన్నతాధికారులకు తెలియజేస్తానని అన్నారు.
ఇదీ చదవండి: