కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న క్రమంలో ప్రకాశం జిల్లా చీరాలలో రెండు రోజుల సంపూర్ణ లాక్డౌన్ను అధికారులు ప్రకటించారు. ఆదివారం ఉదయం 9 గంటల నుంచి మంగళవారం ఉదయం 6 గంటల వరకు మెడికల్ దుకాణాలు సహా అన్నీ మూతపడనున్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని మందులు, పాలు, కూరగాయలు వంటి నిత్యావసరాలు కొనుగోలు చేసి పెట్టుకోవాలని కమిషనర్ రామచంద్రారెడ్డి సూచించటంతో... ఒక్కసారిగా ప్రజలు ఆయా దుకాణాల వద్ద బారులు తీరారు. ఉదయం నుంచే పాలు, కూరగాయలు, మెడికల్ షాపుల వద్దకు క్యూ కట్టారు. దుకాణాల వద్ద భౌతిక దూరం పాటించేలా పోలీసులు, వాలంటీర్లు చూస్తున్నారు.
ఈ రెండు రోజుల పాటు ఎవరైనా రోడ్ల మీదకు వస్తే చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరిస్తున్నారు. మంగళవారం ఉదయం నుంచి యథావిధిగా కంటైన్మెంట్ జోన్ నిబంధనలు అమలవుతాయని.. పట్టణ ప్రజలు రెండు రోజుల లాక్డౌన్కు పూర్తిగా సహకరించాలని చీరాల డీఎస్పీ జయరామసుబ్బారెడ్డి తెలిపారు.
చీరాలలో ఇప్పటికే 47 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. సెకండరీ కాంటాక్ట్ కింద ఇంకా చాలామందికి పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఫలితంగా కేసుల సంఖ్య మరింత పెరిగే అవకాశం కనపడుతోంది. ఈ కారణంగా అధికారులు రెండు రోజుల సంపూర్ణ లాక్డౌన్ అమలు చేస్తున్నారు.
ఇదీ చూడండి..