వైఎస్సార్ ఆసరా పథకం రెండో విడత రుణమాఫీ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి ఈనెల 7వ తేదీన ప్రకాశం జిల్లా ఒంగోలులో ప్రారంభించనున్నారు. ఈ మేరకు రాష్ట్ర విద్యుత్, అటవీ, శాస్త్ర సాంకేతిక, పర్యావరణ శాఖల మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి పర్యటన వివరాలను వెల్లడించారు. ఆ జిల్లా కలెక్టర్ కార్యాలయానికి సోమవారం అధికారిక సమాచారం అందింది. దీంతో సోమవారం స్థానిక పీవీఆర్ పాఠశాల ఆవరణలో మంత్రి పర్యటించారు. జిల్లా కలెక్టర్, ఎస్పీ, సీఎం ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ తలశిల రఘురాం, సీఎం సెక్యూరిటీ ఆఫీసర్ వకుల్ జిందాల్ మైదానాన్ని పరిశీలించారు. వైయస్సార్ ఆసరా పథకం ప్రారంభోత్సవాన్ని విజయవంతం చేయాలని మంత్రి శ్రీనివాసరెడ్డి అధికారులకు సూచించారు.
రెండేళ్ల తరువాత సీఎం జిల్లాకు రానున్నారని ఆయన చెప్పారు. మహిళలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నందున పొదుపు మహిళల కోసం అమలు చేసే పథకాన్ని ఒంగోలులో ప్రారంభించడం అభినందనీయమన్నారు. మహిళల అభ్యున్నతికోసం ఏర్పాటు చేస్తున్న కార్యక్రమంలో సమస్యలు తలెత్తకుండా చూడాలన్నారు. జిల్లా కలెక్టర్, ఎస్పీలు ప్రత్యేక ప్రణాళిక రూపొందించుకొని విజయవంతం చేయాలని మంత్రి కోరారు. జిల్లా ప్రజలపై రాష్ట్ర ముఖ్యమంత్రికి నమ్మకం ఉండడంతోనే ఇక్కడికి వస్తున్నారని ఆయన చెప్పారు.
ఉదయం 9.30 గంటలకు మహిళలు పీవీఆర్ పాఠశాలలో ఉండేలా ఏర్పాట్లు చేయాలన్నారు. కొవిడ్ నిబంధనలు అనుసరించి సుమారు 20 వేలమంది కార్యక్రమానికి హాజరయ్యేలా చూడాలన్నారు. పోలీస్ శిక్షణా కళాశాలలో హెలిప్యాడ్ ఏర్పాటు చేయాలని, వేదిక వరకు ప్రజలు అభివాదం చేసేలా రహదారిపై బారికేడ్లు సిద్ధం చేయాలన్నారు. కార్యక్రమానికి ఎలాంటి అవాంతరాలు ఎదురుకాకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. వైద్య, ఆరోగ్య శాఖ ఏర్పాటు చేసిన కొవిడ్-19 టీకా ఎక్స్ ప్రెస్ మొబైల్ వాహనాన్ని మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి జెండా ఊపి ప్రారంభించారు.