Police Stops The Ex Minister Balineni: ప్రకాశం జిల్లా మార్కాపురంలో సీఎం జగన్ పర్యటించనున్న సంగతి తెలిసిందే. వైఎస్సార్ ఈబీసీ నేస్తం కింద మహిళల ఖాతాల్లోకి 15వేల రూపాయల నిధులను బటన్ నొక్కి జమ చేయనున్నారు. ఈ నేపథ్యంలోనే మార్కాపురంలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. స్థానిక బాలుర ఉన్నత పాఠశాల మైదానంలో సీఎం జగన్ హెలిప్యాడ్ ల్యాండింగ్‌కు అధికారులు ఏర్పాటు చేశారు.
ఈ క్రమంలో హెలిప్యాడ్ వద్దకు వచ్చిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి వాహనాన్ని పోలీసులు అడ్డుకున్నారు. వాహనం పక్కన పెట్టి నడిచి రావాలని బాలినేనికి పోలీసులు సూచనలు చేశారు. అయితే పోలీసుల తీరుపై బాలినేని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తనను అడ్డుకున్నందుకు నిరసనగా కార్యక్రమం నుంచి వెళ్లడానికి వెనుదిరిగారు. అయితే బాలినేనికి సర్దిచెప్పేందుకు మంత్రి ఆదిమూలపు సురేష్, జిల్లా ఎస్పీ ప్రయత్నించిన ఆయన తన అనుచరులతో కలిసి ఒంగోలు వెళ్లిపోయారు.
పలువురు నేతల గృహనిర్బంధం: మరోవైపు మార్కాపురంలో ముందస్తు చర్యల్లో భాగంగా పలువురు నేతలను పోలీసులు గృహనిర్బంధించారు. సీఎం జగన్ రాక సందర్భంగా ఎటువంటి ఘటనలు ఆస్కారం లేకుండా పోలీసులు ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. వెలిగొండ ప్రాజెక్టుపై నిరసన వ్యక్తం చేస్తారని భావించిన పోలీసులు.. పలువురిని గృహనిర్బంధం చేశారు.
మార్కాపురంలో సీపీఎం ఆధ్వర్యంలో నిరసన: ప్రకాశం జిల్లా మార్కాపురంలో సీఎం జగన్ పర్యటన నేపథ్యంలో సీపీఎం ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. మార్కాపురం జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో ఆందోళనలు మొదలుపెట్టారు. నిరసనకారులను పోలీసులు అడ్డుకున్నారు.
సీఎం జగన్ పర్యటన.. చెట్లపై గొడ్డలి పోటు: ముఖ్యమంత్రి జగన్ వస్తున్నారని ప్రకాశం జిల్లా మార్కాపురంలో సంవత్సరాలుగా పెంచిన చెట్ల కొమ్మలను నరికేశారు. ఈబీసీ నేస్తం పథకం ద్వారా మహిళల ఖాతాల్లోకి నగదును జమ చేయనున్నారు. ఇందుకోసం స్థానిక బాలుర ఉన్నత పాఠశాల మైదానంలో హెలిప్యాడ్ ఏర్పాటు చేశారు. భద్రత పేరిట మంగళవారం పాఠశాల ప్రహరీ పొడవునా, బడి వెనకున్న పంచాయతీరాజ్ కార్యాలయ ఆవరణలోని భారీ చెట్ల కొమ్మలను నరికేశారు. అయితే నిజానికి హెలిప్యాడ్‌కు ఇవి చాలా దూరంగా ఉన్నాయి. భారీ కొమ్మలనూ కొట్టేయడంతో మళ్లీ ఆ స్థాయిలో పెరగాలంటే చాలా సమయం పడుతుందని స్థానికులు అభిప్రాయపడ్డారు.
ఇవీ చదవండి: