ప్రకాశం జిల్లా చీరాలలో ఎస్సీ యువకుడు మృతి కేసులో నిర్లక్ష్యం వహించినందుకు చీరాల రెండో పట్టణ పోలీస్ స్టేషన్ ఎస్ఐ విజయ్ కుమార్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో ఇప్పటికే సస్పెన్షన్‌లో ఉన్న ఆయనను...ఇంకొల్లు సీఐ రాంబాబు అరెస్టు చేశారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ఈ నెల 18న వేటపాలెం మండలం కొత్తపేట చెక్‌పోస్టు వద్ద లాక్‌డౌన్ విధులు నిర్వహిస్తున్న పోలీసు సిబ్బందిపై మద్యం మత్తులో ఉన్న షైనీ అబ్రహాం, కిరణ్‌కుమార్ అనే ఇద్దరు యువకులు అనుచితంగా ప్రవర్తించారు. వీరిద్దరినీ రెండో పట్టణ ఎస్ఐ విజయ్ కుమార్ వాహనంలో పోలీస్ స్టేషన్‌కు తరలిస్తుండగా పోలీసుల నుంచి తప్పించుకునేందుకు కిరణ్ కుమార్ మార్గంమధ్యలో కిందికి దూకారు. దీంతో అతని తలకు తీవ్ర గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం చీరాల ఏరియా ఆసుపత్రికి ఎస్ఐ తీసుకెళ్లారని.. అనంతరం మెరుగైన వైద్యసేవల కోసం గుంటూరు తరలించగా అక్కడ చికిత్స పొందుతూ కిరణ్ కుమార్ మృతిచెందారు.
ఈ ఘటనపై రాష్ట్ర డీజీపీ ఆదేశాల మేరకు గుంటూరు జిల్లా అదనపు ఎస్పీ డి.గంగాధర్ సమగ్ర విచారణ చేపట్టారు. తదుపరి కేసు దర్యాప్తును దర్శి డీఎస్పీ కె.ప్రకాశరావుకు అప్పగించారు. విధుల పట్ల ఎస్ఐ విజయ్ కుమార్ నిర్లక్ష్యంగా వ్యవహరించినట్టు గుర్తించారు. అనంతరం ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సస్పెన్షన్‌లో ఉన్న అతన్ని అరెస్టు చేశారు. అయితే ఎస్ఐ విజయ్ కుమార్ కొట్టడం వల్లే కిరణ్ మృతి చెందాడని అతని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.