కరోనా మహమ్మారి కారణంగా విధించిన లాక్ డౌన్ తో చిన్న పెద్ద తేడా లేకుండా అన్ని పరిశ్రమలు కుదేలయ్యాయి. ఎంతో మంది ఉద్యోగాలు కోల్పోయారు.. ఇంకెంతో మంది పరిశ్రమలు మూసేశారు. ఇలాంటి పరిస్థితుల్లో కూడా చిగురిస్తున్నాయి ప్రకాశం జిల్లా చీరాల పట్టణంలోని హరిప్రసాద్ నగర్ లో ఉన్న చిక్కీల తయారీ కేంద్రాలు. కొవిడ్ అనంతరం అందరూ పోషకాహారంపై ఆసక్తి చూపడం ఫలితంగా.. చిక్కీ తయారీ కేంద్రాలు కళకళలాడుతున్నాయి.
ఆ పేరు ఎలా వచ్చింది..
జిల్లాలో హరిప్రసాద్ నగర్ లో చిక్కీలు, అవిసె గింజలు, నువ్వులు, కొబ్బరి ముద్దలు తయారు చేస్తూ ఎన్నో కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. అందుకే ఏకంగా ఇక్కడ ఒక వీధికి ముద్దల బజార్ అని పేరు కూడా వచ్చింది. ఇక్కడ చిక్కిల పాకం తయారీ నుంచి ముద్దలు తయారు చేసి ప్యాకింగ్ చేయటం వరకు మహిళలు చూసుకుంటారు. అనంతరం వాటిని మగవాళ్లు అమ్ముకొని వస్తారు. దశాబ్దాల కాలం నుంచి ఇక్కడ ఈ తరహా కుటీర పరిశ్రమలు కొనసాగుతున్న కారణంగా.. ఈప్రాంతాన్ని ముద్దల బజార్ గా పిలుస్తుంటారు.
కరోనా కాలంలో లాక్ డౌన్ కారణంగా రవాణా లేక ఇక్కడ తయారీ కేంద్రాలు మూతపడ్డాయి. ఇక్కడ తయారైన చిరు తిండ్లు విజయవాడ, గుంటూరు, నెల్లూరు,చిత్తూరు, ఒంగోలు, నరసరావుపేట తో పాటు హైదరాబాద్ ప్రాంతాలకు తీసుకెళ్లి అమ్ముకొస్తుంటారు. ప్రస్తుతం రవాణాసౌకర్యం పూర్తిస్థాయిలో అందుబాటులోకి రాకపోయేసరికి ఖర్చులు పెరిగాయని, వ్యాపారులు ఆవేదన చెందుతున్నారు.
గత 6 నెలలుగా వ్యాపారం లేక పొదుపు కూడా చెల్లించలేకపోయామని మహిళలు వాపోతున్నారు. కరోనా కాలంలో రోగ నిరోధక శక్తిని పెంచే ఆహారాన్ని తీసుకోవాలని సూచిస్తుండటం.. పోషక విలువలు ఉన్న ఆహారాన్ని తీసుకోవటానికి అందరూ ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో చిక్కీల తయారీ కేంద్రాలు మళ్ళీ కళకళలాడుతున్నాయి. కరోనాకు ముందు రోజుకు 50 నుంచి 60 కిలోల ఉండలు తయారు చేస్తే.. అవి ప్రస్తుతం రెట్టింపు తయారు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వం ప్రోత్సహిస్తే మరింతగా వ్యాపారం విస్తరిస్తామని మహిళలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
ఇవీ చూడండి: