దిల్లీలో రైతులు తలపెట్టిన భారత్ బంద్కు సంఘీభావంగా.. ప్రకాశం జిల్లాలో కాంగ్రెస్, వామపక్షాల నేతలు ఆందోళన చేపట్టారు. జిల్లాలోని ఎనిమిది ఆర్టీసి డిపోల నుంచి బస్సులు నడవకుండా నిరసనకారులు అడ్డుకున్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన మూడు నూతన వ్యవసాయ చట్టాలను వెనుక్కు తీసుకోవాలంటూ నినాదాలు చేశారు. సోమనాథన్ కమిటీ నివేదిక ప్రకారం కనీస మద్దతు ధర చట్టబద్దం చేయాలని.. కరెంట్ మోటర్లకు మీటర్లు ఏర్పాటును విరమించుకోవాలని డిమాండ్ చేశారు. ఒంగోలు-కర్నూల్ రోడ్డు ఫ్లై ఓవర్ నుంచి అద్దంకి బస్టాండ్ మీదుగా కలెక్టర్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు.
అద్దంకిలో...
వామపక్షాల ఆధ్వర్యంలో బంద్ ప్రశాంతంగా జరిగింది. రైతు వ్యతిరేక చట్టాలను కేంద్రం వెనక్కి తీసుకోవాలని.. ప్రతిపక్ష నాయకులు డిమాండ్ చేశారు. విద్యాసంస్థలు, బ్యాంకులు, కార్యాలయాలను ప్రజలు స్వచ్ఛందంగా మూసివేశారు. ఆర్టీసీ బస్సులు డిపోకే పరిమితమయ్యాయి.
చీరాలలో...
చీరాలలో వ్యాపార సముదాయాలు, దుకాణాలు, ప్రభుత్వ కార్యాలయాలు మూతపడ్డాయి. పట్టణంలో వామపక్షాలు ర్యాలీ నిర్వహించాయి. అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించారు. యర్రగొండపాలెంలోనూ స్థానిక కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం నేతలు నిరసన ప్రదర్శన చేపట్టారు. రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని నినాదాలు చేశారు.
ఇదీ చదవండి: