గత ప్రభుత్వం హయాంలో మంజూరైన 847 అంగన్‌వాడీ కేంద్రాల నూతన భవన నిర్మాణ పనులు పలు దశల్లో అసంపూర్తిగా నిలిచాయి. అందులో ఒక్కో భవనానికి అంచనాలను బట్టి అప్పట్లో రూ.7.50 లక్షలు; రూ.9 లక్షలు; రూ.10 లక్షలు చొప్పున మంజూరు చేశారు. అందుకు ఉపాధి హామీ నిధుల నుంచి రూ.5 లక్షలు చొప్పున మంజూరవగా, మిగతా నిధులను ఐసీడీఎస్, డీఎంఎఫ్ నుంచి కేటాయించారు. వాటి నిర్మాణ బాధ్యత ఇప్పటివరకు పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ అధికారులు పర్యవేక్షిస్తున్నారు. ప్రస్తుతం అసంపూర్తిగా ఉన్న వాటిని పూర్తి చేసేందుకు అధికార యంత్రాంగం కసరత్తు ప్రారంభించింది. అందులో లెంటల్ లెవల్ లోపున్న వాటిని గృహ నిర్మాణ శాఖ ఇంజినీర్లకు అప్పగించనున్నారు. ఆ పైన నిర్మాణంలో ఆగిన వాటిని పీఆర్ ఇంజినీర్లు పూర్తి చేస్తారు. జిల్లా వ్యాప్తంగా 1,454 కేంద్రాల నిర్మాణానికి ప్రతిపాదించగా, అందులో 923 కేంద్రాలు గ్రామీణ ప్రాంతాల పరిధిలో ఉన్నాయి.
జిల్లాలో ఇదీ తీరు
మొత్తం అంగన్‌వాడీ కేంద్రాలు 4,244
*అద్దె భవనాల్లో కొనసాగుతున్నవి 1,824
*ప్రభుత్వ కేంద్రాల్లో నిర్వహిస్తున్నవి 1,457
*ఇతర శాఖలకు చెందిన భవనాల్లోనివి 963
వసతుల మెరుగుతో మేలు...
జిల్లాలో 1,457 కేంద్రాలను శాశ్వత ప్రభుత్వ భవనాల్లో నిర్వహిస్తుండగా, అందులో 675 వాటిల్లో పాఠశాలల సముదాయంలోనే ఉన్నాయి. సగానికి పైగా కేంద్రాల్లో సౌకర్యాలు లేవు. కనీసం తాగునీరు, మరుగుదొడ్ల వసతి కూడా లేకపోవడంతో పిల్లలను అక్కడ పనిచేస్తున్న ఆయాలు అత్యవసరమైతే బహిర్భూమికి తీసుకెళ్లాల్సిన పరిస్థితి. కొన్ని ప్రాంతాల్లో మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టినా నీటి సమస్య ఉంది. కొన్ని కేంద్రాల్లో కూర్చోడానికి కూడా వసతి లేక పౌష్టికాహారం తీసుకుని ఇళ్లకెళ్తున్నారు. అలాంటి కేంద్రాలకు నాడు-నేడు కార్యక్రమం అమలు ద్వారా అన్ని వసతులు కల్పించనున్నారు.
స్థల సేకరణే సమస్య...
తాజాగా మహిళా, శిశు సంక్షేమశాఖ సేకరించిన గణాంకాల ప్రకారం జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో పనులు చేపట్టాల్సిన వాటిని మినహాయించి మరో 923 భవనాలు నిర్మించాలని నిర్ణయించారు. ఆయా ప్రాంతాల్లో నూతన కేంద్రాలు నిర్మించాలంటే తొలుత స్థలాలను గుర్తించాలి. ఆ ప్రాంతాల్లో స్థల సేకరణ చేసి, అంగన్‌వాడీ కేంద్రాలకు కేటాయించాలని కోరుతూ కలెక్టర్ ఉత్తర్వుల మేరకు మూడు నెలల క్రితం ఐసీడీఎస్ నుంచి 56 మండలాల తహసీల్దార్లకు నివేదిక పంపారు. వంద గ్రామాలకు పైగా ఇంతవరకు స్థలం అందుబాటులో లేకపోవడంతో పనులు ప్రారంభానికి నోచుకోలేదు. నూతన అంగన్‌వాడీ భవనాలకు స్థల సేకరణే ప్రధాన సమస్యగా మారింది.
ఇదీ చదవండి: కబడ్డీ క్రీడాకారిణి అఖిలకు వైకాపా ఆర్థిక సాయం